Amit Shah Election Campaign in Hyderabad : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం రేపు హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా లాల్‌దర్వాజకు చేరుకుంటారు. బీజేపీ హైదారాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొననున్నారు.
లాల్‌దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట పాటు ఈ రోడ్ షో సాగనుంది. రోడ్ షో ముగించుకుని అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి 9:15 గంటల నుంచి 10:15 గంటల వరకు చేవెళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటారు. నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి మోదీ పదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహాసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు చేసిన సహాయాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించేలా పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం ముగించుకున్న తర్వాత రాష్ట్ర కార్యాలయం నుంచి బేగంపేట ఐటీసీ కాకతీయకు 10:30 గంటలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.