Graduate MLC Elections Campaign 2024 :పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారీ మెజార్టీ సాధించేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. వడ్లకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు పట్టభద్రులే తగిన బుద్ధి చెప్పాలని ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విజ్ఞప్తి చేశారు.
హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని, అందుకే పట్టభద్రులంతా ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సహా హాలియాలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, అమలుకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మాయ మాటలు చెప్పే వారిని పెద్దల సభకు పంపవద్దని, విద్యావంతులనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
'ఆరు గ్యారెంటీలు అని చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపించి, మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. కేసీఆర్ ఆల్రెడీ రైతుబంధు ఇస్తున్నారు కదా కాంగ్రెస్ రూ.15 వేలు ఇస్తుందంటగా, కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తుందంటగా అని మాయలో పడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో రకరకాల మయామటలు చెప్పి, అవి వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారం చేపట్టింది '- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు