Pratidwani Debate on Measures to Control Accidents in Industries :పరిశ్రమల్లో భద్రతా లోపం కార్మికుల ప్రాణాల్ని గాల్లో దీపంలా మార్చుతోంది. వరస పారిశ్రామిక ప్రమాదాలు భారీ ప్రాణనష్టాన్ని తీరని విషాదాన్ని మిగిలుస్తున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ పారిశ్రామికవాడల వరకు కార్మికుల్లో ప్రాణభయం వెంటాడుతోంది. ప్రాంతాలు, ఫ్యాక్టరీలు మారవచ్చేమో గానీ క్రమం తప్పకుండా విషవాయువుల లీకేజీ, రియాక్టర్లు, బాయిలర్లలో పేలుళ్లు, ఏదోక కారణంతో ఎగిసిపడుతోన్న అగ్నికీలలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
బుధవారం నాడు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. కార్మికుల ఆర్తనాదాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావాహకంగా మారింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లెయిన్‌తో శిథిలాల కిందనుంచి మృతదేహాలను వెలికితీయాల్సి వచ్చింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రమాదాల నియంత్రణ, నివారణ ఎవరి బాధ్యత? : మరి తెలుగురాష్ట్రాలే కాదు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది విశాఖ అచ్యుతాపురం సెజ్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదం మనకి ఎటువంటి పాఠాన్ని నేర్పిస్తోంది? వీటి విషయంలో గమనించాల్సిన అంశాలు ఏమిటి? ఏదైనా పరిశ్రమ మరీ ముఖ్యంగా రసాయన పరిశ్రమల్లో అంతర్గత భద్రతచర్యలు ఎలా ఉండాలి? ఈ విషయంలో ఇండస్ట్రియల్ సేఫ్టీ మాన్యువల్ ఏం చెబుతోంది? ఏం జరుగుతోంది? సేఫ్టీ మాన్యువల్ అమలు జరుగుతుందా లేదా అన్నదాంతోబాటు పరిశ్రమల్లో ప్రమాదాల నియంత్రణ, నివారణ ఎవరి బాధ్యత?