Prathidhwani on T20 World Cup 2024 Final :అజేయమైన పోరాటస్ఫూర్తితో దూసుకెళ్తూ పొట్టి క్రికెట్ ప్రపంచకప్‌కు ఒకేఒక్క అడుగుదూరంలో నిలిచింది టీమిండియా. మరో వైపు ప్రత్యర్థి జట్టు కూడా అంతే జోరులో ఉంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఓటమి ఎరుగకుండా ఫైనల్‌కు చేరింది దక్షిణాఫ్రికా. బలాబలాలు, పోరాట స్ఫూర్తిలో ఏమాత్రం తీసిపోని వీరిద్దరిలో ప్రపంచకప్పును ముద్దాడేది ఎవరు? ఈ ప్రశ్నతోనే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అభిమానుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది.
మరి అంతిమ పోరాటం ఎలా ఉండబోతోంది? అభిమానులకు ఎలాంటి మజాను అందించబోతోంది? డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి మరీ ఫైనల్‌లో అడుగు పెట్టిన భారతజట్టు వ్యూహాలు, అస్త్రాలు ఏమిటి? టీ20 క్రికెట్‌లో 2 అత్యుత్తమజట్ల మధ్య జరగనున్న తుదిపోరుపై అభిమానుల అంచనాలు, నిపుణుల విశ్లేషణలు ఎలా ఉన్నాయి? ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్, రంజీ మాజీ ఆటగాడు.
T20 World Cup 2024 Final Match :2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఫైట్ భారత్- సౌతాఫ్రికా మధ్య జరగనుంది. బర్బాడోస్ వేదికగా జూన్ 29న ఈ ఫైనల్ జరగనుంది. టైటిల్‌కు ఒక్క అడుగు ఉన్న ఇరుజట్లు కూడా ఛాంపియన్‌గా నిలవాలని ఆశిస్తున్నాయి. అయితే 2013 నుంచి టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. చివరిసారిగా ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమ్ఇండియా 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకుంది. అప్పటి నుంచి ఐసీసీ కప్పు కోసం భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ 11ఏళ్ల కాలంలో పలు సందర్భాల్లో ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరినప్పటికీ తృటిలో కప్పు చేజార్చుకుంది.
సౌతాఫ్రికా చివరిసారి 1998 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. బంగ్లాదేశ్ ఢాకా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 245 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కి దిగిన సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. 37 పరుగులు, 5 వికెట్లతో అదరగొట్టిన ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.