తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పీలీభీత్‌పైనే అందరి ఫోకస్- గాంధీల్లేకుండా 30ఏళ్లలో తొలిసారి పోరు- జితిన్ ప్రసాద గెలుస్తారా? - Pilibhit Lok Sabha Gandhi Family

Pilibhit Lok Sabha Gandhi Family : సార్వత్రిక ఎన్నికల వేళ వరుణ్‌గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. వరుణ్‌గాంధీ, లేదా ఆయన తల్లి మేనకా గాంధీల్లో ఒకరు 1996 నుంచి పీలీభీత్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. వరుణ్‌కు ఈసారి బీజేపీ టికెట్‌ నిరాకరించడం వల్ల 30 ఏళ్ల తర్వాత తల్లి, కొడుకులు లేకుండానే పీలీభీత్‌ బరిలో కమలదళం నిలిచింది. వరుణ్‌ గాంధీకి నియోజకవర్గ ప్రజలకు మధ్య బలమైన అనుబంధం ఉన్న నేపథ్యంలో బీజేపీ కొత్త అభ్యర్థికి వారు ఎంతవరకు మద్దతిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

Pilibhit Lok Sabha Gandhi Family
PilibhitPilibhit Lok Sabha Gandhi Family Lok Sabha Gandhi Family

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 8:59 AM IST

Pilibhit Lok Sabha Gandhi Family : ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ కీలక నేత వరుణ్‌గాంధీకి టికెట్‌ నిరాకరించిన తర్వాత ఆయన ఇన్నేళ్లూ ప్రాతినిథ్యం వహించిన పీలీభీత్‌ లోక్‌సభ నియోకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత 30 ఏళ్లుగా ఈ నియోజకవర్గానికి వరుణ్‌గాంధీ లేదా ఆయన తల్లి మేనకా గాంధీ లోక్‌సభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 1996 నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు యోగీ ప్రభుత్వ తీరుపై వరుణ్‌గాంధీ కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించింది.

మేనకాగాంధీ జనతాదళ్‌ పార్టీ నుంచి 1989లో తొలిసారి పీలీభీత్‌ నుంచి గెలుపొందారు. 1991లో ఓడిన ఆమె 1996 ఎన్నికల్లో మరోసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో బీజేపీ టికెట్‌పై మేనకా మరోసారి విజయం సాధించారు. 2009లో ఇక్కడి నుంచి వరుణ్‌గాంధీ బీజేపీ తరఫున జయకేతనం ఎగరవేశారు. ఆ తర్వాత 2014లో మళ్లీ ఈ సీటును మేనకాకు కేటాయించగా ఆమె మరోసారి ప్రాతినిధ్యం వహించారు. 2019లో రెండోసారి ఈ నియోజకవర్గ ఎంపీగా వరుణ్‌ ఎన్నికయ్యారు. కానీ ఈసారి మేనకా సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. పీలీభీత్‌ను యూపీ మంత్రి జితిన్‌ ప్రసాదకు బీజేపీ అధినాయకత్వం కేటాయించింది.

జితిన్ ప్రసాదకు ఎన్నో సవాాళ్లు
జితిన్‌ ప్రసాద 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పుర్‌, ధరూరా స్థానాల నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలుపొందారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. వరుణ్‌ గాంధీకి పీలీభీత్‌ నియోజకవర్గ ప్రజలతో విడదీయలేని బంధం ఉన్న నేపథ్యంలో జితిన్‌ ప్రసాదకు అక్కడ ఎంత వరకు విజయావకాశాలు ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆయన తనకంటూ ప్రత్యేక రాజకీయ భూమిక తయారు చేసుకునేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టికెట్‌ రాకున్నా తుదిశ్వాస వరకు!
పీలీభీత్‌లో జితిన్‌ ప్రభావం చాలా తక్కువగా ఉందనీ, ఆయనను ఒక బయటి వ్యక్తిగానే నియోజక వర్గ ప్రజలు చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పీలీభీత్‌ ప్రజలకు వరుణ్‌గాంధీతో లోతైన బంధం ఉందని పేర్కొంటున్నారు. వరుణ్‌కు టికెట్‌ తిరస్కరించిన పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అటు వరుణ్‌ రాసిన భావోద్వేగ లేఖ గురించి వారు చెబుతున్నారు. టికెట్‌ రాకున్నా తుదిశ్వాస వరకు పీలీభీత్‌ ప్రజలతో తన అనుబంధం కొనసాగుతుందని, రాజకీయాలతో కాకుండా ప్రేమ, విశ్వాసంతో తమ బంధం నిండి ఉందని వరుణ్‌ లేఖ రాశారు.

పార్టీ పరంగా పూర్తి మద్దతు
జితిన్‌ ప్రసాదకు ప్రజలతో అనుబంధం లేకపోయినప్పటికీ పార్టీ పరంగా ఆయనకు పూర్తి మద్దతు ఉంది. పీలీభీత్‌ స్థానంలోని నలుగురు MLAలూ జితిన్‌కు పూర్తి మద్దతిస్తున్నారు. ఆయన తరఫున సీఎం యోగి సహా కీలక నేతలు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. దశాబ్ధ కాలంగా ఈ నియోజకవర్గంలో ఒక ప్రధాని ఎప్పుడూ ప్రచారం నిర్వహించలేదు. జితిన్‌కు టికెట్‌ ఇచ్చి వరుణ్‌కు టికెట్‌ ఇవ్వలేదన్న కారణంతో ఓటు బ్యాంకు ప్రభావితం కావద్దని పార్టీ ఇక్కడ మోదీ ర్యాలీని షెడ్యూల్‌ చేసిందన్న వాదనలు ఉన్నాయి.

జితిన్‌ ప్రసంగాలన్నీ మోదీపైనే
ప్రచారసభల్లో జితిన్‌ ప్రసంగాలు కేవలం మోదీ చరీష్మాపైనే ఆధారపడి ఉంటున్నాయి తప్ప తన గురించి చెప్పుకోవడానికి ఏం లేదని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ కలిసి భగ్వత్‌ సరన్‌ గంగ్వార్‌ను రంగంలోకి దింపాయి. పీలీభీత్‌లోని మొత్తం 18 లక్షల ఓటర్లలో ముస్లీంలు, లోధీల తర్వాత ఉన్న మూడో అతిపెద్ద వర్గమైన కుర్మీలను గంగ్వార్‌ ప్రభావితం చేయగలరని తెలుస్తోంది. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలే లక్ష్యంగా గంగ్వార్‌ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజల దృష్టి ఈయనపై కూడా పడిందని సమాచారం. ఇక మరో ప్రధాన పార్టీ బీఎస్పీ మాజీ మంత్రి అనీస్‌ అహ్మద్‌ను పోటీలో నిలిపింది. ఈయన కూడా ముస్లీం, దళితుల ఓట్లను ప్రభావితం చేయగలరన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకు ఊరట నిస్తున్నాయి. పీలీభీత్‌లోని మొత్తం 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింటిలో బీజేపీ విజయం సాధించింది. ఒక దాంట్లో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.

అభివృద్ధిపై ప్రజలు సంతృప్తి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు విడతల్లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల్లో తొలి దశలోనే పీలీభీత్‌కు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 19న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు, అభ్యర్థులను పక్కనపెడితే ప్రజలు మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధిపై పూర్తి సంతృప్తిగా లేనట్లు కనిపిస్తోంది. నేపాల్‌ సరిహద్దుల్లోని టెరాయి బెల్ట్‌లో పీలీభీతే మెడికల్‌ హబ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కేవలం ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మాత్రమే ఉంది. అది కూడా మహిళలకు మాత్రమే. కొన్ని చక్కెర పరిశ్రమలు తప్ప ఇతర పరిశ్రమల కొరత ఉండటంతో ఉపాధిపై కూడా ప్రజలు ఒకింత పెదవి విరుస్తున్నారు.

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతకు ఇక్కడ వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. పీలీభీత్‌ టైగర్‌ రిజర్వు వల్ల పర్యాటకాభివృద్ధి బాగానే ఉన్నప్పటికీ సరైన రవాణా, ఇతర మౌళిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ రంగంలోనూ వృద్ధి చెందడం కష్టమని స్థానికులు తెలిపారు. వర్షాకాలాల్లో శారదా నది ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు ప్రభావితమవుతున్నా పాలకులు దృష్టి సారించడం లేదని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details