Maharashtra Loksabha Polls 2024 : మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా తొలి రెండు దశల్లో 13 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మూడో దశలో 11 స్థానాలకు మే ఏడున పోలింగ్ జరగనుంది. ఈ పదకొండు స్థానాల్లో గెలుపును అధికార-ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల మూడో దశ ఎన్నికలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఈ విడతలో వదినా మరదళ్లు బరిలో నిలిచిన బారామతి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు పోటీ చేస్తున్న సతారా, కొల్హాపుర్‌లతోపాటు మొత్తంగా 11 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది.
ఎన్డీఏ వర్సెస్ ఇండి కూటమి
హాట్కణంగ్లే, సతారా, కొల్హాపుర్, బారామతి సాంగ్లీ, సోలాపుర్, మాధా స్థానాలు పశ్చిమ మహారాష్ట్రలో ఉండగా లాతూర్, ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్నాయి. రాయ్‌గడ్, రత్నగిరి-సింధుదుర్గ్ నియోజకవర్గాలు కొంకణ్ ప్రాంతంలో ఉన్నాయి. మెజార్టీ సీట్లలో పోరు ప్రధానంగా అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండి కూటమి మధ్యే హోరాహోరీగా ఉంది. ఈ 11 స్థానాల్లో మొత్తం 258 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
బారామతిపైనే అందరి ఫోకస్
మూడో విడతలో పోలింగ్ జరగనున్న బారామతి, కొల్హాపుర్, రత్నగిరి, సింధుదుర్గ్ స్థానాల్లో ఎన్డీఏ-ఇండి కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ విడతలో అందరి దృష్టీ ప్రధానంగా బారామతిపైనే కేంద్రీకృతమైంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. పవార్ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఎన్సీపీ తరఫున ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు.
కుమార్తె కోసం శరద్ పోరాటం!
పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిలో సూలే 2009 నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు వరుసగా ఆరుసార్లు శరద్ పవార్ విజయం సాధించారు. ఇప్పుడు బారామతిలో సూలే ఓడితే శరద్ పవార్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. పార్టీ శ్రేణులపై పట్టు కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే కుమార్తె విజయం కోసం శరద్ పవార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఉస్మానాబాద్‌లోనూ కుటుంబ పోరే!
మహారాష్ట్రలో కీలకమైన ఉస్మానాబాద్‌లోనూ కుటుంబ పోరే కనిపిస్తోంది. బీజేపీ తరఫున ఎమ్మెల్యే రాణా జగ్జీత్‌సిన్హ్ పాటిల్ సతీమణి అర్చనా పాటిల్ పోటీ చేస్తుండగా జగ్జీత్‌సిన్హ్ సమీప బంధువైన సిట్టింగ్ ఎంపీ ఓంప్రకాశ్ రాజె నింబాల్కర్‌కు శివసేన యూబీటీ టికెట్ ఇచ్చింది. కొల్హాపూర్ నుంచి ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్ శాహూ ఛత్రపతి మహరాజ్ కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. సీఎం ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన సంజయ్ మండ్లిక్‌కు టికెట్ ఇచ్చింది. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఈ స్థానంలో శ్రీమంత్ శాహూకు మద్దతు ప్రకటించాయి.