తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కర్ణాటకలో ఆసక్తికర సమరం- బీజేపీ, కాంగ్రెస్ టఫ్​ ఫైట్​- రెండు పార్టీలకూ కీలకమే! - Lok Sabha Election 2024 Karnataka - LOK SABHA ELECTION 2024 KARNATAKA

Lok Sabha Election 2024 Karnataka : కన్నడ నాట మరో ఆసక్తికర రాజకీయ సమరం మొదలైంది. పొత్తులు, ఎత్తులు, ఆధిపత్య ప్రదర్శనకు లోక్‌సభ ఎన్నికలు వేదికగా మారాయి. దక్షిణాదిలో అత్యధికస్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌, ఉత్తరాది ప్రభావాన్ని దక్షిణాదికి విస్తరించాలని బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రం కావడం, అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కర్ణాటక ఎన్నికల్లో సత్తాచాటి దక్షిణాదిలో బలాన్ని మరింత పెంచుకోవాలని కమల దళం ప్రణాళిక రచిస్తోంది.

Lok Sabha Election 2024 Karnataka
Lok Sabha Election 2024 Karnataka

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 7:47 AM IST

Lok Sabha Election 2024 Karnataka : సార్వత్రిక సమరంలో భాగంగా కర్ణాటకలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌- ప్రతిపక్ష బీజేపీ కూటమి సమాయత్తమయ్యాయి. శాసనసభ పోరు జరిగిన ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు రాగా, తమ పాలనకు ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పడతాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. సంక్షేమ పథకాల అమలే ప్రచార అస్త్రంగా ఆ పార్టీ దూసుకెళ్తోంది. జేడీఎస్​తో పొత్తుతో కాంగ్రెస్‌తో పోరాడుతున్న బీజేపీకు కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

జేడీఎస్​కు మనుగడ పోరాటం
దక్షిణాదిలో ఇప్పటివరకు బీజేపీ అధికారం చేపట్టిన ఏకైక రాష్ట్రం కర్ణాటకే కావడం వల్ల ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం బీజేపీకు ప్రతిష్టాత్మకంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత తమ ఉనికిని బలాన్ని చాటుకునేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. విజన్‌ 370 సాధించాలంటే కర్ణాటకలో పట్టు నిలుపుకోవడం కూడా బీజేపీకి కీలకమే. బీజేపీతో పొత్తుపెట్టుకుని మూడు సీట్లు తీసుకున్న జేడీఎస్​కు ఈ ఎన్నికలు మనుగడ పోరాటంగా మారాయి.

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలు దక్కించుకోగా ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి అయిన సినీ నటి సుమలత విజయం సాధించారు. కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ ఖాతా తెరవలేకపోయింది. గత ఏడాది మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోరులో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది.

హస్తం 15- కమలం 20!
224 స్థానాలున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135, బీజేపీ 66 సీట్లు గెలుచుకోగా, జేడీఎస్ 19 సీట్లకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ కనీసం 15 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కమలం పార్టీ కూడా 20 స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

విజయేంద్రకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష!
కర్ణాటకలో కనీసం 25 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్‌లో బీజేపీ కర్ణాటక అధ్యక్షుడిగా యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను నియమించారు. ఫలితంగా విజయేంద్రకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, యడియూరప్ప కుమారుడు కావడం వల్లే పదవి దక్కిందనే విమర్శలను తిప్పికొట్టేందుకు ఆయనకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.

నీటి కొరతే ప్రచార అంశం
ఇటీవల రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు, విధాన సౌధ వద్ద పాకిస్థాన్ అనుకూల నినాదాలు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయోత్సవాల్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలును బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల మెతకగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. కాంగ్రెస్‌కు కర్ణాటక సర్కార్‌ ఏటీఎం ప్రభుత్వంగా మారిందని, ఇక్కడి నుంచి డబ్బు వసూలు చేసి దిల్లీలో హస్తం పార్టీ ఖజానా నింపుతారని ఆరోపించారు. కర్ణాటకలో నీటి కొరత ఎన్నికల్లో కీలక ప్రచార అంశంగా మారే అవకాశం ఉంది.

గ్యారంటీలపై కాంగ్రెస్ ఆశలు
మరోవైపు అధికార కాంగ్రెస్‌ గ్యారంటీ స్కీమ్‌లను ప్రచారస్త్రాలుగా చేసుకుంది. శక్తి, గృహ లక్ష్మి, గృహ జ్యోతి, యువ నిధి పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అన్న భాగ్య పథకం కూడా హస్తం పార్టీకి కలిసి రావచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కర్ణాటకపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శలు చేస్తోంది. కర్ణాటకకు రావాల్సిన నిధుల వాటా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అనేక ప్రాంతాల్లో కరవును ఎదుర్కొనేందుకు సాయం అడిగినా చేయడంలేదని కాంగ్రెస్‌ వివరిస్తోంది.

నిధుల విడుదలలో కేంద్రం అన్యాయం!
కరవు నివారణకు రూ.8 వేల 172 కోట్లు విడుదల చేయాలని 2023 అక్టోబర్‌ 20న కేంద్రానికి లేఖ రాశామని ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫిబ్రవరి 7న దిల్లీలో కర్ణాటకకు నిధులు విడుదలలో అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళన కూడా చేశారు. రాజ్యాంగ సవరణపై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఐదు ఎన్నికల హామీలు కూడా!
వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటకలో ఆధిపత్య వొక్కలిగ వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన బలంగా ఉన్నారు. బలమైన స్థానిక నాయకత్వం కూడా హస్తం పార్టీకి కలిసిరానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కర్ణాటకకు చెందిన వారు కావడం వల్ల ఇక్కడ దళితుల ఓట్లను ఏకీకృతం చేసే అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి దక్కింది. అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన ఐదు ఎన్నికల హామీలను సిద్ధరామయ్య ప్రభుత్వం అమలు చేయడం కూడా కలిసిరానుంది.

బీజేపీ ఎంపీలపై వ్యతిరేకత
సిటింగ్‌ బీజేపీ ఎంపీలపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. జేడీఎస్‌-బీజేపీ పొత్తు పెట్టుకోవడం కొన్ని నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి అనుకూలంగా మారింది. అయితే కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులు లేకపోవడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. నేతల మధ్య అంతర్గత విభేదాలు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి. ఖర్గే సహా పలువురు అగ్రనేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా మైనస్‌గా మారింది. వక్కళిగ, లింగాయత్‌ల కులగణనపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కూడా కాంగ్రెస్ అవకాశాలకు ప్రభావితం చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డీకే సురేష్ ప్రత్యేక దక్షిణాది వ్యాఖ్యలు ప్రతికూలంగా మారనున్నాయి.

మోదీపైనే బీజేపీ ఆశలు
ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. సంఘ్ పరివార్ మద్దతు, సంస్థాగతంగా బలంగా ఉండడం కమలం పార్టీకి కలిసిరానుంది. క్షేత్రస్థాయిలో పటిష్ఠ వ్యవస్థ, అయోధ్యలో రామమందిర ప్రారంభం, పౌరసత్వ సవరణ చట్టం అమలు వంటి అంశాలు సానుకూలంగా మారాయి. బలహీనంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో బీజేపీకు మద్దతు పెరుగుతోంది. జేడీఎస్​తో పొత్తు కూడా కొన్ని స్థానాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది సిట్టింగ్ ఎంపీలపై వ్యతిరేకత మాత్రం బీజేపీకు ప్రతికూలంగా మారింది. బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు, టికెట్‌ రాని అభ్యర్థుల తిరుగుబాటు కూడా కమలం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో అవినీతి, దుష్పరిపాలనపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది.

జేడీఎస్​కు మోదీ కరిష్మాతో బెనిఫిట్
జేడీఎస్‌ కూడా ఎంపీ ఎన్నికల్లో క్రియా శీలక పాత్ర పోషించనుంది. బలమైన వొక్కళిగ సంఘం మద్దతు జేడీఎస్​కు ఉంది. ప్రాంతీయ పార్టీ ట్యాగ్ లైన్‌ కూడా కలిసిరానుంది. రైతు అనుకూల ఇమేజ్ కారణంగా గ్రామీణ ప్రజానీకానికి చెందిన ఒక వర్గంలో కుమారస్వామి పార్టీకి సానుకూలత ఉంది. ఎన్‌డీఏలో భాగం కావడంవల్ల మోదీ కరిష్మా కూడా జేడీఎస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే మూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం జేడీఎస్​కు ప్రతికూలంగా మారింది. బీజేపీతో పొత్తుపై జేడీఎస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తు కారణంగా జేడీఎస్‌ సెక్యులర్‌ ఇమేజ్‌ దెబ్బతింది. వారసత్వ రాజకీయ ఆరోపణలు కూడా కుమారస్వామి పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు వల్ల ఓట్ల బదిలీ జరిగితే జేడీఎస్‌కు కాస్త ఊరట లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details