Gujarat Caste Factor :ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారే అంశాల్లో కులం కూడా ఒకటి. గుజరాత్‌లో కుల ఆధారిత ఎన్నికల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో చెప్పారు. కుల సమీకరణల ఆధారంగా చేపట్టే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని స్పష్టం చేస్తున్నారు. గుజరాత్ పట్టణ ప్రాంతాల్లో కులాల ప్రాబల్యం ఎన్నికల్లో మునుపటితో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కులమే ప్రధానాంశంగా ఉందని అంటున్నారు. గుజరాత్‌లోని 6.50 కోట్ల జనాభాలో పటీదార్లు 11-12 శాతం ఉన్నారు. అనేక ఉపవర్గాలతో ఓబీసీలు 40 శాతం ఉన్నారు.
కులాల ఆధారంగా సీట్లు కేటాయింపు
ఉత్తరాన ఠాకూర్‌లు, మధ్య గుజరాత్, సౌరాష్ట్రలో కోలీలు ఎక్కువగా ఉన్నారని గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆరుగురు పటీదార్లు, ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు కోలీలను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఆరుగురు పటీదార్లు, ఏడుగురు ఓబీసీలు, ఇద్దరు కోలీలకు టికెట్లు కేటాయించాయి. అంటే రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కూడా దాదాపు సమానంగా కుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టమైంది.
తమ కులం అభ్యర్థికే ప్రజలు జై!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం గుజరాత్‌కు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తొలి నలుగురు నేతలూ, బ్రాహ్మణ లేదా వానిక్ సామాజిక వర్గాల వారేనని సామాజిక శాస్త్రవేత్త విద్యుత్ జోషి తెలిపారు. 1970ల తర్వాత గుజరాత్‌లో పటీదార్ల రాజకీయ ప్రాబల్యం పెరిగినట్లు వెల్లడించారు. చిమన్‌భాయి పటేల్ 1973లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కులం ఒక గుర్తింపు అనీ, అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో కులాన్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని విస్మరించలేరని తెలిపారు. తమ కులం వారిని ఎన్నుకుంటే ఎన్నికల తర్వాత పనులు సకాలంలో పూర్తవుతాయని, సంప్రదింపులు జరపడం తేలిక అవుతుందన్న భావన గ్రామీణ ఓటర్లలో ఉండిపోయిందని వివరించారు.
సంఘటిత హిందూ ఓటు బ్యాంకు కోసం బీజేపీ ప్రయత్నాలు
అహ్మదాబాద్, వడోదర వంటి మధ్య, దక్షిణ గుజరాత్ పట్టణ ప్రాంతాల్లో కుల ప్రభావం తగ్గుతోందని, అయితే సౌరాష్ట్ర ఉత్తర గుజరాత్ వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కులమే ఆధిపత్యం ప్రదర్శిస్తోందని రాజకీయ విశ్లేషకుడు అమిత్ ధోలాకియా తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఒకప్పుడు కులం కారణంతో ఓటు వేయాలని అభ్యర్థులు నేరుగా ఓటర్లను అడిగేవారని, ఇప్పుడు హిందుత్వం, లేదా ప్రధాని మోదీ అభివృద్ధి నినాదంతో ఓట్లను అభ్యర్థిస్తున్నారని చెప్పారు. గుజరాత్ రాజకీయాలను చూసినట్లైతే కుల గుర్తింపును అసంపూర్ణం చేసి సంఘటిత హిందూ ఓటు బ్యాంకును కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుందని విశ్లేషకులు తెలిపారు. హిందుత్వం కారణంగా సౌరాష్ట్రలో క్షత్రియులు క్రమంగా ఆధిపత్యాన్ని కోల్పోతున్నారని ఉదహరించారు. అయితే కుల గుర్తింపును మళ్లీ బలోపేతం చేసి హిందుత్వ రాజకీయాలను ఎదుర్కోవాలని ఇండియా కూటమి ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు.