Youtube Creator Amy Landino :చాలా మంది మంచి కాలేజీలో గొప్ప చదువులు చదివితేనే.. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని అనుకుంటారు. కానీ, మన దగ్గర టాలెంట్ ఉంటే ఏ డిగ్రీలు లేకుండానే నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చని నిరూపిస్తోంది ఓమహిళ. ఇంతకీ ఆమె ఎవరు ? యూట్యూబ్‌లో ఏ కంటెంట్ వీడియోలను అప్‌లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తోంది ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
న్యూయార్క్‌కి చెందిన ఈమె పేరు అమీ ల్యాండినో (AMY LANDINO). ఒకానొక టైమ్‌లో ఫీజు కట్టలేక కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసింది. తర్వాత ప్రొడక్టివిటీ కోచ్‌గా మారింది. వ్యాపార వృద్ధికి కావాల్సిన నైపుణ్యాల్ని వీడియోల రూపంలో అందించడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఓ కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా రాణిస్తోంది. తనలో ఉన్న స్కిల్స్‌ని కెరీర్‌గా మార్చుకొని ఏడాది తిరిగే సరికి కోట్లు సంపాదిస్తోంది.
విద్యా రుణం చెల్లించలేక!
అమీ ల్యాండినోది చిన్నతనం నుంచి ముక్కుసూటి వ్యక్తిత్వం. తన వల్ల అయ్యే పనులే చేస్తుంది. అంతేకానీ మొహమాటానికి పోయి తన సామర్థ్యానికి మించిన పనులు నెత్తినేసుకొని ఒత్తిడికి లోనవదు. అమీది మధ్య తరగతి కుటుంబం. పాఠశాలవిద్యాభ్యాసం పూర్తయ్యాక అమీ కాలేజీలో చేరింది. ఆమె పైచదువుల కోసం తండ్రి విద్యా రుణం తీసుకున్నాడు. అయితే ఇది అమీ ల్యాండినోకు భారంగా అనిపించింది. ఇలా ఓవైపు తన తండ్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మరోవైపు ఆ టైమ్‌లో ఉద్యోగ సంక్షోభం ఎక్కువగా ఉండడం వల్ల కాలేజీ చదువుకు గుడ్‌బై చెప్పింది అమీ.
అటు ఉద్యోగం.. ఇటు వీడియోలు!
అమీ తొలుత ఓ సంస్థలో పబ్లిక్ పాలసీ అసిస్టెంట్‌గా చేరింది. అక్కడ చిన్న స్థాయి వ్యాపారులకు సోషల్ మీడియా ఖాతాలపై అవగాహన కల్పిస్తూ.. వాటిని ఎలా మేనేజ్ చేయాలో వివరించేది. మరోవైపు ఇదే కంటెంట్‌ని వీడియోలుగా రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్ చేసేది. ఇవి చూసిన తన స్నేహితులు ఆమీని ప్రశంసించేవారు.
ఓ స్నేహితురాలు 'నువ్వు కంటెంట్ క్రియేటర్‌గా ఎందుకు మారకూడదు?' అని ప్రశ్నించింది. దీంతో కొంత కాలం తర్వాత ఆమె చేస్తున్న ఉద్యోగం మానేసి.. పూర్తిగా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. రోజురోజుకీ తన వీడియోలకు ప్రేక్షకాదరణ లభించడంతో పాటు, సబ్‌స్క్రైబర్ల సంఖ్యా పెరిగింది.