Hyderabad Metro Rail Fares : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. మెట్రో రైలు ఛార్జీలను పెంచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలు ఏడేళ్ల క్రితం నిర్ణయించినవి అని, ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త కోచ్‌లు కొనుగోలు చేసేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు సదరు సంస్థ తెలిపింది. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మధ్యనే బెంగళూరు మెట్రో రైలు ఛార్జీలను అక్కడి ప్రభుత్వం 50 శాతం వరకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం నడుస్తున్న 57 మెట్రో రైళ్లు మూడు మార్గాల్లో చాలడం లేదు. వాటికి అదనంగా మరో 10 రైళ్లు అయినా అవసరమని మెట్రో వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తమ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందని, సర్కారు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే కొత్త కోచ్‌లు కొంటామని అంటోంది. దీంతో ఛార్జీల సవరణ అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సవరణ ఇప్పుడే కాదు రెండేళ్ల క్రితమే వచ్చింది. అయినా ప్రభుత్వం అందుకు మొగ్గు చూపకపోవడంతో ఆలోచనను తాత్కాలికంగా నిలిపివేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమై ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ఛార్జీలు పెంచాలని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ రెండేళ్ల క్రితమే నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇదే విషయమే కేంద్రానికి నివేదించగా అప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సదరు సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను కమిటీ పరిశీలించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. అప్పుడు ఎన్నికల ముందు కావడంతో అప్పటి ప్రభుత్వం ఛార్జీల పెంపు సాహసం చేయలేదు. పైగా పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది.
రెండేళ్ల క్రితమే పెంపు ఆలోచన : ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడం, బెంగళూరులో ఛార్జీల పెంపు తాజాగా అమల్లోకి రావడంతో మళ్లీ హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల పెంపు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. తాజా పెంపు ప్రతిపాదనలతో రావాలనే సంకేతాలను హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్) ఇదివరకే ఎల్ అండ్ టీకి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఛార్జీల పెంపు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎంఆర్ ఏం చేస్తాయో వేచి చూడాలి.
ఇంకా నిర్లక్ష్యం చేస్తే తొమ్మిదో స్థానానికి పడిపోతాం : ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్ మెట్రోకు ఏడాదికి రూ.1,300 కోట్లు నష్టం - షాకింగ్ న్యూస్ చెప్పిన ఎండీ