Benefits Of Waking Up In Brahma Muhurta :బ్రహ్మముహూర్త సమయం.. దీన్నే అమృత కాలమనీ, బ్రహ్మ సమయమనీ అంటారు. ఇది బ్రహ్మ దేవునికి సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది. వేకువ జామున మూడున్నర- మూడు ముప్పావు నుంచి అయిదు - అయిదన్నర గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మముహూర్తమని పేరు. పూర్వం మహర్షులు, రుషులు ఆధ్యాత్మిక ధ్యానం చేసేందుకు ఈ పవిత్రమైన కాలాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్లు కూడా సంగీత సాధనకూ, చదువుకునేందుకూ చిన్నారులను బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు.
సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా గంటా ముప్ఫైఆరు నిమిషాల ముందుగా వచ్చే ఈ టైంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని.. ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు, ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు (అనూరుడు అనే పేరూ ఉంది) ఎర్రని రంగు కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత సూర్య కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం, ఆహ్లాదకరంగా అనిపించడంతోపాటు శరీరానికి విటమిన్ డీ కూడా పుష్కలంగా అందిస్తుంది.
ఆ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ప్రయోజనాలా! : ఇక, బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ టైంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సౌండ్ వినిపించదు. దాంతో దైవారాధన చేసినా, విద్యార్థులు చదువుకున్నా, ఏదయినా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తిచేయవచ్చు. మనసు చేస్తున్న పనిపైనే శరీరం లగ్నం అవుతుంది. ఇంద్రియాలూ సైతం అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నింటికీ మించి మెదడు పనితీరూ చురుగ్గా ఉంటూ, మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు.