Cotton Balls Uses for Homemade:కాటన్ బాల్స్ అనగానే ముఖానికి రోజ్ వాటర్ రాసుకోవడానికి, వేసుకున్న మేకప్ తొలగించుకోవడానికి, నెయిల్ పాలిష్‌ని తొలగించుకోవడానికి ఉపయోగిస్తుంటారని తెలుసుకు. ఇలా మహిళల సౌందర్య సంరక్షణలో ఇవి చాలా రకాలుగానే ఉపయోగపడతాయి. కానీ వీటిని కేవలం బ్యూటీ విషయంలోనే కాకుండా ఇంట్లో మరిన్ని అవసరాల కోసం కూడా వాడచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఇంట్లో చీమల బెడదను తగ్గించుకోవాలంటే.. కొన్ని వేడి నీళ్లలో కొద్దిగా చక్కెర, టీస్పూన్ బోరాక్స్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో ముంచిన కాటన్ బాల్‌ను చీమలున్న చోట పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.
- కొన్ని దుస్తులు ముక్క వాసన వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని చుక్కల వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ని కాటన్ బాల్‌పై వేసి కబోర్డ్‌లో ఓ మూల ఉంచితే దుస్తులు సువాసనలు వెదజల్లుతాయని అంటున్నారు. అలాగే రిఫ్రిజిరేటర్‌లో నుంచి వచ్చే దుర్వాసనలు పోగొట్టడానికి కూడా ఈ చిట్కాను పాటించవచ్చని చెబుతున్నారు.
- ఇంకా మన వంటింట్లో కూడా అప్పుడప్పుడూ దుర్వాసనలు రావడం సహజమే. అయితే, ఇలాంటి సమయాల్లో కొన్ని కాటన్ బాల్స్‌ను ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్‌లో కాసేపు ఉంచి.. ఆ గిన్నెను ఓ మూలన ఉంచడం వల్ల ఫలితం ఉంటుందని వివరించారు.
- మనం సాధారణంగా స్విచ్‌బోర్డులు, డోర్ నాబ్స్, డోర్ స్టాపర్స్ వంటి చిన్న చిన్న వస్తువుల్ని శానిటైజ్ చేయడానికి పెద్ద పెద్ద క్లాత్స్‌ను వాడుతుంటాం. కానీ వీటి కంటే చిన్న కాటన్ బాల్స్ ఉపయోగిస్తే సులభంగా పని పూర్తవుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో సింక్, ట్యాప్‌లను శుభ్రం చేస్తే క్లీన్‌గా ఉంటాయని అంటున్నారు.
- మనం ఇంటి పెరట్లో పెంచుకునే గార్డెన్‌ను ఎలుకలు, ఉడతలు వంటివి పాడుచేస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెనిగర్‌లో ముంచిన కొన్ని కాటన్ బాల్స్‌ను గార్డెన్‌లో అక్కడక్కడా వేయడం వల్ల సమస్య ఇట్టే పరిష్కారమవుతుందని చెబుతున్నారు.
- కొత్త చెప్పులు లేదా షూలు వేసుకున్నప్పుడు వాటి రాపిడికి పాదాలపై ఎరుపెక్కడం, దద్దుర్లు వస్తుంటాయి. అలా జరగకుండా ఉండదంటే ఆయా భాగాలపై కాటన్ బాల్స్ ఉంచి చెప్పులు లేదా షూస్ వేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
- పిల్లలు డ్రాయింగ్ వేసేటప్పుడు చేతులపై మార్కర్, రంగుల మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు పాలల్లో ముంచిన కాటన్ బాల్‌తో మరకలు పడిన చోట రుద్దితే ఇట్టే వదిలిపోతాయని నిపుణలుు అంటున్నారు.