How to Make Ankapur Natukodi Curry: నాటుకోడి పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నాటుకోడితో పులుసు, కర్రీ, ఫ్రై ఇలా వంటకం ఏదైనా పేరు చెప్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇక తింటే మాటలు ఉండవు. నాటుకోడిలోనూ అంకాపూర్ నాటుకోడి రుచి మరింత ప్రత్యేకం. ప్రత్యేకమైన మసాలాలతో తయారు చేసే ఈ రుచికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందుకే అంకాపూర్ చికెన్‌ను ఒక్కసారి టేస్ట్ చేసిన ఎవరైనా సరే మళ్లీ తినాలని భావిస్తుంటారు. అయితే ఈ నాటుకోడి కూరను తినాలంటే అంకాపూర్ వెళ్లాలి. అలా వెళ్లలేని వాళ్లు ఓసారి మేము చెప్పే స్టైల్లో అంకాపూర్ నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఘాటు నషాళానికి ఎక్కిద్ది. ఈ వీకెండ్‌కు ఇంట్లోనే ఈ రెసిపీ ట్రై చేసి ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయండి. మరి లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కోసం ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- మసాలా కోసం:
- బిర్యానీ ఆకు - 1
- జీలకర్ర - 1 టీ స్పూన్
- అనాస పువ్వు - 1
- యాలకులు - 3
- దాల్చిన చెక్క - కొద్దిగా
- జాపత్రి - కొద్దిగా
- లవంగాలు - 6
- పల్లీలు - పావు కప్పు
- ఎండు కొబ్బరి ముక్కలు - 3 టేబుల్ స్పూన్లు
- ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు
- మిరియాలు - అర టేబుల్ స్పూన్
కర్రీ కోసం:
- నూనె - 60 ml
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 3 రెబ్బలు
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- నాటుకోడి ముక్కలు - అర కిలో
- కారం - 2 టీ స్పూన్లు
- నీళ్లు - 300ml
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- అంకాపూర్ నాటుకోడి కర్రీకి ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బిర్యానీ ఆకు, జీలకర్ర, అనాసపువ్వు, యాలకులు, దాల్చినచెక్క, జాపత్రి, లవంగాలు, పల్లీలు, ఎండుకొబ్బరి ముక్కలు, ధనియాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేగి మంచి వాసన వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు తొందరగా ఫ్రై కావాలని హై ఫ్లేమ్‌లో వేయించితే కర్రీ టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి కొంచెం ఓపికతో లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి.
- మసాలా దినుసులు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ దినుసులను మిక్సీజార్‌లోకి తీసుకుని మిరియాలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరగాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి.
- కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంతవరకు సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చికెన్ ముక్క లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేవరకు ఫ్రై చేసుకోవాలి.
- చికెన్ ముక్క రంగు మారిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుని కలిపి 30 సెకన్లు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత 300ml నీళ్లు, కొత్తిమీర తరుగు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి కేవలం మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఆవిరి పోయిన తర్వాత మూత తీసి మరోసారి స్టవ్ ఆన్ చేయాలి. ఆపై గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, మరికొంచెం కొత్తిమీర తరుగు, పావులీటర్ నీళ్లు పోసి కలిపి మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేవరకు ఉడికించుకోవాలి.
- ఈ సమయంలో ఓసారి ఉప్పు, కారాలు చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మరో 2 నిమిషాలు మగ్గించి సర్వ్ చేసుకుంటే దీ బెస్ట్ అంకాపూర్ నాటుకోడి కర్రీ రెడీ. ఈ కర్రీని జొన్నరొట్టెలతో కలిపి తింటే స్వర్గం దిగిరావాల్సిందే. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
సండే స్పెషల్.. నాటుకోడి కూర.. బోటీ మసాలా ఫ్రై.. ఇలా చేశారంటే.. బొక్కకూడా వదలరు
తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!