Viral Video on Throwing Water Bottles from Train :సాధారణంగా చాలా మంది బస్సు, కారు ప్రయాణం కన్నా రైలు జర్నీని ఇష్టపడతారు. ఎందుకంటే రైలు ప్రయాణం ముందుకు వెళ్తున్నా కొద్దీ చెట్లు వెనక్కి వెళుతున్నట్లు, ప్రకృతి అందాలు, జాలువారే జలపాతాలు, పక్షుల కిలకిలరావాలతో ఎంతో సుదరంగా ఉంటుంది. అందుకే ట్రైన్ జర్నీ అస్సలు బోర్ కొట్టదు. అయితే, మనం జర్నీ చేసే సమయంలో అనేక తప్పులు చేస్తుంటాం. అందులో కిటీకి నుంచి వాటర్ బాటిల్ విసిరేయడం ఒకటి. అదేంటి కిటికీ నుంచి వాటర్ బాటిల్ బయటికి విసిరిస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. వాటర్ బాటిల్ వేయడం వల్ల జరిగే పరిణామాలను వివరిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లేట్ చేయకుండా దానిపై ఓ లుక్కేయండి.
సాధారణంగా రైలు జర్నీ చేస్తున్న సమయంలో ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడం కామన్. ఇక వీటిని ఖాళీ చేసి బయట పడేయటం వెరీ కామన్. ట్రైన్ లోపల చెత్త డబ్బాలు ఉన్నా సరే బయటికి విసిరేస్తే అదో ఫీలింగ్ అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఎవరు చూస్తారు, ఏం జరుగుతుందిలే అనే నిర్లక్ష్యాన్ని కనబరుస్తుంటారు. అలాంటి వారిని ఆలోచింపజేసేలా ఈ వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే:ఆ వీడియోలో రైలు వెళ్తుండగా, ఓ ప్రయాణికుడు ఖాళీ వాటర్ బాటిల్‌ని బయటకు విసిరేశాడు. అది పట్టాలపై పడి పట్టలా మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్‌కి అదే ట్రాక్‌పై వస్తున్న ట్రైన్ లోకో పైలట్ నుంచి కాల్ వచ్చింది. తాను ఆ ట్రాక్‌పై రావచ్చా అని అడిగితే, స్టేషన్ మాస్టర్ రావచ్చు అని చెబుతారు. అలా చెప్పిన వెంటనే అక్కడ పట్టాలపై ఏదో సమస్య ఉన్నట్లు సిగ్నల్ అలర్ట్ చూపిస్తుంది. అది చూసిన స్టేషన్ మాస్టర్, అక్కడ ఏమైందో చెక్ చెయ్యమని రైల్వే ఉద్యోగులకు ఫోన్ చేస్తారు. ఆ ఉద్యోగులు అక్కడికి వెళ్లి చూడగా పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్ కనిపించింది. దీంతో దాన్ని వారు జాగ్రత్తగా అక్కడి నుంచి తొలగించి స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేశారు. సిగ్నల్ కరెక్ట్‌గా ఉందా? లేదా అని అడగగా కరెక్ట్‌గానే ఉన్నట్లు స్టేషన్ మాస్టర్ సమాధానం ఇచ్చి, ఏం జరిగింది అని అడుగుతారు. దీంతో ఆ రైల్వే ఉద్యోగులు పట్టాలపై వాటర్ బాటిల్ పడేస్తే అది పట్టాల మధ్యలో ఇరుక్కన్నట్లు సమాధానమిస్తారు.
అందుకే "రైలు కోచ్‌లలో వ్యర్థాలను అదే కోచ్‌లో ఉండే డస్ట్ బిన్‌లలో వెయ్యాలే తప్ప కిటికీ నుంచి బయటకు విసిరేయకూడదు. దీని వల్ల రైలు ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి. రోజూ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల బాటిళ్లను ఇలాగే విసిరేస్తున్నారు. ఇవి పట్టాలపై పెను సమస్యగా మారుతున్నాయి. ప్రమాదాలకూ కారణం కావొచ్చు. అందుకే ఇకపై ఇలా చెయ్యవద్దు" అని వీడియోలో సూచించారు.