Tips to Remove Tea Stains from Clothes :టీ తాగేటప్పుడు ఒక్కోసారి దుస్తుల మీద పడుతుంటుంది. దీంతో ఆ ప్రదేశంలో మరకలు ఏర్పడుతుంటాయి. ఆ మరకలను తొలగించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు గోరువెచ్చని నీళ్లు పోసి, ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా రుద్దుతుంటారు. దీనివల్ల మరక పోవడం అటుంచితే.. ఆ ప్రదేశంలో దుస్తుల రంగు వెలిసిపోయినట్లుగా తయారవుతుంది. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా దుస్తులపై ఏర్పడిన టీ మరకలను ఈజీగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో మీరు చూసేయండి.
బేకింగ్ సోడాతో..
సాధారణంగా వంటింట్లో బజ్జీలు, కేక్‌లు ఇతర ఆహార పదార్థాలు చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగిస్తుంటాం. అయితే.. ఇది దుస్తులపై పడిన చాయ్ మరకల్ని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం టీ మరకలు పడిన ప్రదేశంలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత దుస్తుల్ని క్లీన్ చేస్తే టీ మరక మాయం.
కాస్త వేడి నీటితో..
నార్మల్‌గా కాటన్ దుస్తులపై టీ మరకలు పడితే ఓ పట్టాన తొలగిపోవు. అలాంటప్పుడు ఎక్కడైతే టీ మరక పడిందో ఆ ప్రదేశంలో కాస్త వేడిగా ఉన్న వాటర్‌ని నేరుగా పోయాలి. మరీ వేడిగా ఉన్న వాటర్‌ని ఉపయోగించకూడదు. వేడి ఎంత ఎక్కువగా ఉంటే.. దుస్తుల నాణ్యత అంత దెబ్బతినే అవకాశాలున్నాయి.
స్ప్రే చేయాలి..
చాయ్ మరకల్ని తొలగించడంలో వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కప్పు వాటర్‌లో టేబుల్‌స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ లిక్విడ్‌ని స్ప్రే బాటిల్లో పోసి మరక పడిన చోట స్ప్రే చేయాలి. ఆపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే క్రమంగా మరక తొలగిపోతుంది.
టూత్‌పేస్ట్‌తో మరకలు మాయం..
దుస్తుల రంగు వెలిసిపోకుండా టీ మరకలు ఈజీగాతొలగిపోవాలంటే మనం బ్రష్ చేసుకోవడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్ యూజ్ చేయవచ్చు. ఇందుకోసం మరక పడిన చోట టూత్‌పేస్ట్ కొద్దిగా పూసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై మంచి నీటితో ఆ వస్త్రాన్ని ఉతికేస్తే సరిపోతుంది. మరక పూర్తిగా మాయమవుతుంది.
ఇలా కూడా మరక మాయం చేయొచ్చు!
- దుస్తులపై టీ పడిన వెంటనే వెళ్లి వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మరక సులభంగా పోతుంది. ఒకవేళ అలా కుదరకపోతే కూల్ వాటర్‌లో ఆ వస్త్రాన్ని అరగంట పాటు నానబెట్టి ఉతకాలి.
- ఎక్కువ మంది టీ మరకల్ని తొలగించుకోవడానికి నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులోని బ్లీచింగ్ లక్షణాల వల్ల రంగు బట్టలు వెలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ టిప్‌ని తెలుపు రంగు దుస్తులకు మాత్రమే ఉపయోగించడం మంచిది.
- టీ మరక పడిన ప్రదేశంలో కాస్త లిక్విడ్ డిటర్జెంట్ వేసి చేతి మునివేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేస్తే మరక పోతుంది.
దుస్తులపై మొండి మరకలు పోవట్లేదా? - ఇలా ఉతికితే ఇట్టే మాయమైపోతాయ్!
దుస్తులపై రక్తం మరకలా? - ఈ టిప్స్ పాటిస్తే చిటికెలో పోయి కొత్త వాటిలా మెరుస్తాయి!