Bank Locker Rules 2024 : విలువైన ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు లాంటివి సురక్షితంగా భద్రపరుచుకోవడానికి బ్యాంక్ లాకర్లు చాలా అనువుగా ఉంటాయి. మరి మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన నగలను, పత్రాలను బ్యాంక్ లాకర్లో భద్రపరచాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోని లాకర్స్ గురించి, వాటి నియమ, నిబంధనల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. అప్పుడే మీ అవసరాలకు తగిన సరైన బ్యాంక్ లాకర్‌ను ఎంచుకోవడానికి వీలవుతుంది. పైగా అదనపు ఛార్జీల భారం తగ్గుతుంది.
బ్యాంక్ లాకర్లో ఉంచదగిన, ఉంచకూడని వస్తువులు ఇవే!
బ్యాంక్ లాకర్స్‌లో ఏ వస్తువులు బడితే ఆ వస్తువులను ఉంచుకోవడానికి వీలుండదు. అందుకే ఇప్పుడు బ్యాంకు లాకర్లో ఉంచదగిన, ఉంచకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం.
బ్యాంక్ లాకర్లో స్టోర్ చేయదగిన వస్తువులు :
- బంగారు, వెండి నగలు, వజ్రాలు సహా విలువైన లోహాలతో చేసిన ఆభరణాలు బ్యాంక్ లాకర్లో ఉంచుకోవచ్చు. అలాగే విలువైన నాణేలు, గోల్డ్, సిల్వర్ బార్స్ కూడా లాకర్లో దాచుకోవచ్చు.
- మీ ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ, వీలునామా సహా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ లాకర్లో భద్రపరుచుకోవచ్చు.
- మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, షేర్ సర్టిఫికెట్స్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ పాలసీలు సహా మీ ఫైనాన్సియల్ రికార్డ్‌లు అన్నింటినీ బ్యాంక్ లాకర్లో ఉంచుకోవచ్చు.
బ్యాంక్ లాకర్లో ఉంచకూడని వస్తువులు :
- ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) సహా నిషేధిత వస్తువులను, పదార్థాలు.
- త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలు, కాలక్రమంలో పాడైపోయే పదార్థాలు, వస్తువులు లాకర్లో ఉంచడానికి వీలుపడదు.
- తినగలిగే నిల్వ పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు, హానికరమైన వస్తువులు కూడా లాకర్లో ఉంచకూడదు.
- బ్యాంకు లాకర్లో నగదు ఉంచుకోవడానికి కొన్ని బ్యాంకులు అనుమతించవు. ఎందుకంటే నగదు అనేది సురక్షితమైనది కాదు, అలాగే దానికి ఇన్సూరెన్స్ కూడా ఉండదు.
SBI Bank Locker Agreement
- ఎస్బీఐ బ్యాంకు లాకర్లో చట్టబద్ధమైన, విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు భద్రపరుచుకోవచ్చు. కానీ డబ్బులు మాత్రం దానిలో స్టోర్ చేయడానికి ఒప్పుకోరు.
- ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నిషేధిత పదార్థాలు ఎస్బీఐ లాకర్లో ఉంచడానికి వీలుండదు.
- త్వరగా పాడయ్యే వస్తువులు లేదా పదార్థాలు, రేడియో యాక్టివ్ వస్తువులు, చట్ట విరుద్ధమైన వస్తువులు లాకర్లో ఉంచకూడదు.
- బ్యాంకుకు, బ్యాంక్ కస్టమర్లకు హానికలిగించే లేదా ఇబ్బందికలిగించే వస్తువులను కూడా ఎస్బీఐ లాకర్లో ఉంచడానికి వీలుండదు.
నోట్ : ఎస్బీఐ మాత్రమే కాదు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇంచుమించు ఇవే రూల్స్‌ను పాటిస్తున్నాయి.
లాకర్లో ఏం పెట్టారో చెప్పాల్సిన పనిలేదు!
కస్టమర్లు తమ లాకర్లో ఏం దాచారో బ్యాంకు అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా లాకర్ లోపల ఏముందో బ్యాంకులకు తెలిసే అవకాశం ఉండదు. కనుక జరిగిన నష్టానికి పరిహారం లెక్కించడం సాధ్యం కాదు. నిబంధనల ప్రకారం, లాకర్లోని వస్తవులకు బ్యాంకులు బాధ్యత వహించవు. లాకర్‌పై పూర్తి బాధ్యత లీజు తీసుకున్న వ్యక్తికే మాత్రమే ఉంటుంది.
లాకర్లో పెట్టిన వస్తువులు పోతే?
వాస్తవానికి మనం బ్యాంకు లాకర్లలో దాచుకున్న వస్తువులకు బ్యాంకులు బాధ్యత వహించవు. కానీ అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, బ్యాంకు భవనం శిథిలమవ్వడం లేదా బ్యాంకు ఉద్యోగుల మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినప్పుడు.. మీరు లాకర్ కోసం కట్టిన వార్షిక అద్దెపై మాత్రమే 100 రెట్లు పరిహారం అందిస్తుంది. అంతే తప్ప లాకర్లో ఉన్న వస్తువులకు పరిహారం అందించదు. ఉదాహరణకు వార్షిక లాకర్ ఛార్జీ రూ.1000 అనుకుంటే.. బ్యాంకులు దానిపై 100 రెట్లు పరిహారం అందిస్తాయి. అంతేతప్ప మీరు లాకర్లో ఉంచిన వస్తువులకు పరిహారం అందించదు.