How to Get Rid of Lizards Easily from Home : ఇంటి గోడలపైన ఉండే బల్లుల వల్ల నేరుగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా వాటిని చూసి చాలా మంది భయపడుతుంటారు. ఈ క్రమంలోనే వాటిని ఇంటి నుంచి తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు ఏదో ఒక మూలన నక్కి మళ్లీ ఇంట్లోకి తిరిగి వస్తుంటాయి. మీ ఇంట్లో కూడా బల్లుల బెడద ఎక్కువగా ఉందా? అయితే, ఈ 5 రకాల మొక్కలను మీ ఇంట్లో పెంచండి. ఆ మెుక్కలు విడుదల చేసే వాసనలు బల్లులకు పడవట. దాంతో ఇంట్లోకి వచ్చిన బల్లులుఎక్కువసేపు ఉండకుండా పారిపోతాయంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ మెుక్కలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తులసి : ఈ మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. అలాగే ఎన్నో అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్న తులసి మొక్క బల్లులను తరిమికొట్టడంలో కూడా చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తులసిలో ఉండే మిథైల్ సిన్నమేట్, లినాలూల్ వంటి లక్షణాలు ఉంటాయి. తద్వారా వాటి నుంచి వచ్చే వాసన బల్లులకు పడదట. దాంతో ఇవి ఇంట్లోకి రాకుండా ఉంటాయట. అందుకే పెరట్లోనే కాకుండా ఇంట్లోనూ చిన్న కుండీలో ఒక తులసిమొక్కను పెంచుకోవడం బల్లులను తరిమికొట్టడానికి చాలా బాగా పని చేస్తుందంటున్నారు.
బంతి మొక్క : చాలా మంది ఇళ్లలో విరివిగా పెంచే మొక్కలలో ఒకటి బంతి. ఇంటి అలంకరణ, దేవుడి పూజకు బంతిపూలను ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాదు.. బంతి మొక్కలు బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టడానికి తోడ్పడతాయట. ముఖ్యంగా బంతి పువ్వులో ఉండే పైరెత్రిన్, ట్రాపెజియం అనే క్రిమిసంహారక మూలకాలుంటాయి. ఫలితంగా వాటి నుంచి వెలువడే ఘాటైన వాసన బల్లులకు పడదట. దాంతో బల్లులు ఇంటి నుంచి పారిపోతాయంటున్నారు నిపుణులు.
పుదీనా : వంటకాల రుచిని పెంచే పుదీనాకూడా బల్లులను తరిమికొట్టడానికి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుదీనా మొక్కలో మెంథాల్ అనే మూలకం ఉంటుంది. తద్వారా ఆ మొక్క ఆకుల నుంచి వెలువడే సువాసన బల్లులకు అస్సలు నచ్చదట. అందుకే ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోవడం ద్వారా బల్లుల బెడదను తగ్గించుకోవచ్చంటున్నారు.
లెమన్ గ్రాస్ :ఇది చూడటానికి సాధారణ గడ్డిలానే కనిపిస్తుంది. కానీ, ఇదొక ప్రత్యేక రకం. దీనిలో సిట్రోన్సెల్లా అనే ఒక రసాయనం ఉంటుంది. అదే నిమ్మగడ్డిగి ఒక ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది. అయితే, లెమన్‌గ్రాస్ నుంచి ఈ సువాసన బల్లులకు నచ్చదట. కాబట్టి మీరు ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం ద్వారా దాని నుంచి వచ్చే వాసనను తట్టుకోలేక బల్లుల అక్కడి నుంచి పారిపోతాయంటున్నారు నిపుణులు.