How to Make Chicken Samosa at Home: ఎక్కువ మంది ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్‌లో సమోసా ఒకటి. వాతావరణం కూల్‌గా ఉన్నప్పుడు.. సాయంత్రం సమయంలో.. సమోసా విత్ గరం చాయ్ కాంబినేషన్ కిర్రాక్ ఉంటుంది. కాగా సమోసా అంటే ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కార్న్ సమోసా మాత్రమే తిని ఉంటారు. ఇంట్లో కూడా వీటిని మాత్రమే చేస్తుంటారు. అయితే ఎప్పుడూ అవే తింటే బోర్ కోడుతుంది. కాబట్టి ఈసారికి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ సమోసా తయారు చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చికెన్‌ను ఇష్టపడేవారు వీటిని ఇంకా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- మైదా పిండి - ఒకటిన్నర కప్పులు
- ఉప్పు - అర టీ స్పూన్
- వాము - అర టీ స్పూన్
- నెయ్యి - 3 టీ స్పూన్లు
- నూనె - 3 టీ స్పూన్లు
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 2
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
- చికెన్ కీమా - 200 గ్రాములు
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - ఒకటిన్నర టీ స్పూన్లు
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో మైదాపిండి తీసుకోవాలి. అందులోకి ముప్పావు టీ స్పూన్ ఉప్పు, వాము, నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా చేసి దానిపైన కాస్త ఆయిల్ రాసి మూత పెట్టి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు చికెన్ ఫిల్లింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంతవరకు ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించుకోవాలి.
- అల్లం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ కీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేడి కలిపి కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
- చికెన్ మిశ్రమం చల్లారని తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని ఓ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
- ఇప్పుడు మైదా పిండి మిశ్రమాన్ని మరోమారు కలిపి నిమ్మకాయ సైజ్‌లో ఉండలుగా చేసుకోవాలి. అందులో ఒక ఉండను తీసుకుని చపాతీ పీట మీద పొడి పిండి చల్లుకుంటూ చపాతీలుగా చేసుకోవాలి.
- ఆ చపాతీలను మూడు ఇంచుల వెడల్పు, తొమ్మిది ఇంచుల పొడవు వచ్చే విధంగా స్కేల్ సహాయంతో కట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని సమోసా షీట్స్ మాదిరిగా చేసుకోవాలి.
- ఇప్పుడు సమోసా షీట్స్ సీల్ చేయడం కోసం.. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చిక్కని పేస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలి.
- తర్వాత ఒక సమోసా షీట్‌ను చేతిలోకి తీసుకొని ట్రై యాంగిల్ వచ్చేలా మలుచుకోవాలి. తర్వాత మళ్లీ ఇంకో మడత పెట్టుకోండి. ఇప్పుడు కోన్ మాదిరిగా తయారవుతుంది.
- అప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫిల్లింగ్ను కొద్దిగా ఉంచి అన్ని చివరలకు మైదా పేస్ట్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం షీట్స్ అయిపోయేంత వరకు సమోసాలు ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇలా షీట్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కష్టమనుకుంటే మార్కెట్లో ఇవి లభిస్తాయి.
- తర్వాత స్టౌపై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక సమోసాలను నూనెలో వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆపై వాటిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో.. క్రంచీగా, ఎంతో క్రిస్పీగా నోరూరించే " చికెన్ సమోసాలు" రెడీ. వీటిని టమాట కెచప్ లేదంటే పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి.