తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

విరిగిన పాలతో "కమ్మటి దోశ, తీయటి కలాకండ్" చేసేయండిలా!- టేస్ట్​ అద్భుతంగా ఉంటాయి! - SPOILED MILK RECIPES IN TELUGU

-విరిగిన పాలు ఇలా వాడితే అమృతమే!

Spoiled Milk Recipes
Spoiled Milk Recipes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 3:48 PM IST

Spoiled Milk Recipes : అనుకోకుండా కొన్నిసార్లు టీ లేదా కాఫీ తయారీ కోసం.. పాలు మరిగిస్తున్న సమయంలో విరిగిపోతుంటాయి. ఫలితంగా ఆ పాలతో టీ లేదా కాఫీ పెట్టలేం. అలాగే పెరుగు కూడా తోడేయలేం. దీంతో చాలా మంది ఆ పాలతో ఏం చేయాలో తెలియక బయట వృథాగా పారబోస్తుంటారు. అయితే, కాస్త ఓపిక ఉంటే చాలు విరిగిన పాలతో రుచికరమైన దోశ, తీయటికలాకండ్ చేసుకోవచ్చు. పైగా వీటిని చేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. మరి ఇక ఆలస్యం చేయకుండా విరిగిన పాలతోఈ రెండు రెసిపీలను ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

How to Make Spoiled Milk Dosa గోధుమ దోశకి కావాల్సిన పదార్థాలు :

  • గోధుమ పిండి - కప్పు
  • ఉప్మా రవ్వ - పావు కప్పు
  • విరిగిన పాలు - రెండు కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • క్యారెట్‌ తురుము- కొద్దిగా
  • సన్నగా తరిగిన క్యాప్సికం
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - చెంచా
  • పచ్చిమిర్చి ముద్ద - చెంచా
  • పసుపు - పావు చెంచా
  • అర కప్పు నీళ్లు
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో గోధుమ పిండి, ఉప్మా రవ్వ, విరిగిన పాలు పోసుకుని బాగా మిక్స్​ చేయాలి.
  • ఆపై క్యారెట్‌ తురుము, ఉప్పు, సన్నగా తరిగిన క్యాప్సికం, క్యారెట్, కొత్తిమీర తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకోవాలి.
  • తర్వాత స్టౌపై దోశల పెనం పెట్టండి. పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్​ వేసి స్ప్రెడ్​ చేయండి.
  • ఇప్పుడు గరిటెతో పిండి పోసుకోవాలి. తర్వాత దోశఅంచుల వెంబడి కొద్దిగా ఆయిల్​ వేయాలి. రెండు వైపులా దోశలను మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన దోశలు రెడీ.
  • వీటిని ఏదైనా చట్నీ లేదా కారంపొడితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

Spoiled Milk Kalakand Recipe : కలాకండ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • విరిగిన పాలు - లీటర్
  • చిక్కటి పాలు - అర లీటర్
  • పంచదార - 3 టేబుల్‌స్పూన్లు
  • మిల్క్‌పౌడర్‌ - కప్పు
  • నెయ్యి - చెంచా
  • యాలకుల పొడి - అర చెంచా
  • కుంకుమ పువ్వు - కాస్త
  • బాదం పలుకులు - 2 టేబుల్‌స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా విరిగిన పాలను వస్త్రంతో వడకట్టాలి. ఆ పనీర్‌ను చపాతీపిండిలా కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. దీనిని రాత్రంతా​ ఫ్రిడ్జ్‌లో ఉంచాలి.
  • మరుసటి రోజు ఫ్రిడ్జ్​లో నుంచి తీసి మళ్లీ కలిపి పక్కనుంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి చిక్కటి పాలు పోయాలి. మీడియం ఫ్లేమ్​లో పాలను కలియతిప్పుతూ సగమయ్యేదాకా మరిగించాలి.
  • ఇప్పుడు అందులో మిల్క్‌పౌడర్‌ జతచేసి ఉండలు కట్టకుండా బాగా తిప్పుతుండాలి.
  • ఈ మిశ్రమం చిక్కగా అయ్యాక.. రాత్రంతా​ ఫ్రిడ్జ్‌లో ఉంచిన పనీర్, యాలకుల పొడి, కుంకుమపువ్వు, పంచదార వేసి కలుపుతూ బాగా దగ్గరపడ్డాక దించేయాలి.
  • ఆపై పళ్లెంలో నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని సమంగా సర్దుకోవాలి. కలాకండ్​పైన బాదం పలుకులతో గార్నిష్‌ చేయాలి.
  • చల్లారాక నచ్చిన షేప్​లో ముక్కలు కట్‌ చేస్తే.. తియతియ్యటి 'కలాకండ్‌' మీ ముందుంటుంది.

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!

తోడు లేకుండానే మీ ఇంట్లో కమ్మటి పెరుగు - ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details