Best Tips to Preserve Pickles in Rainy Season :మనలో చాలా మంది కూర చేయనప్పుడు ఇంట్లో ఏదైనా పచ్చడి లేదా ఊరగాయ ఉంటే చాలు దానితోనే ఆ పూట గడిపేస్తుంటారు. నిజానికి వేడి వేడి అన్నం లేదా రోటిలో ఊరగాయ వేసుకొని తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే.. చాలా మంది ఎండకాలం ఆవకాయ, టమాటా, నిమ్మకాయ వంటి వివిధ రకాల నిల్వ పచ్చళ్లు పెట్టుకుంటుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ పచ్చళ్లు(Pickles) వర్షాకాలం రాగానే ఫంగస్ కారణంగా బూజు పట్టి పాడైపోతుంటాయి. కాబట్టి, అలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సరిగ్గా నిల్వ చేయాలి :పచ్చళ్లు పాడవ్వకుండా ఎక్కువకాలం రుచిగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. సరిగ్గా నిల్వచేయడం. అందుకోసం వీలైనంత వరకు ఎప్పుడూ గాలి చొరబడని గ్లాసు కంటెయినర్స్, జాడీలు వాడాలి. అంతేకానీ.. ప్లాస్టిక్ బ్యాగ్స్, కంటెయినర్స్ వాడుకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.
జాడీలు క్లీన్‌గా ఉండాలి :పచ్చడిని ప్రిపేర్ చేశాక అది నిల్వ చేసే జార్ బాగా క్లీన్ చేయాలి. అలాగే.. జార్ని తుడిచి, కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆపై పూర్తిగా పొడిగా అయ్యాకనే ఊరగాయ లేదా పచ్చడి నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా.. వీలైనంత వరకు ఇత్తడి, రాగి, ఇనుము, జింక్‌తో చేసిన జాడీలను వాడకపోవడం బెటర్. ఎందుకంటే.. పచ్చళ్లలోని ఆమ్లం ఈ లోహాలతో చర్య జరిపే అవకాశం ఉంటుందట. ఫలితంగా ఊరగాయ రంగు, రుచి రెండూ మారే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
ఈ ప్లేస్‌లో భద్రపరచాలి : నిల్వ పచ్చళ్లను ఎండతగలకుండా నీడ ఉన్నప్లేసులో భద్రపరచుకోవాలి. దీంతో పాటు రెగ్యులర్‌గా పచ్చళ్లని కలుపుతూ ఉండాలి. అదేవిధంగా ఊరగాయ లేదా పచ్చడి ఎక్కువగా డ్రై కాకుండా నూనె తగినంతగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.