How to Find the Purity of Cooking Oil:తాగే నీరు, పీల్చే గాలి, తినే పండ్లూ, కూరగాయలు కావేవీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. దేశంలోని చాలా ఆహార, నిత్యావసర పదార్ధాలు కల్తీ అవుతున్నాయి. అక్రమార్కుల కక్కుర్తి కారణంగా.. పాలు, నీళ్లు, నూనె కూడా విషంగా మారి ప్రజలను రోగాలబారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల నూనెలను అక్రమార్కులు కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక వైపు ధరలు మండిపోతుంటే.. మరో వైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో.. మనం ఉపయోగించే వంట నూనెలు స్వచ్ఛమేనా? అనే అనుమానం రాక మానదు. అందుకే వాటిలోని కల్తీని గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పలు సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నూనెలు కల్తీ అవుతున్నాయి ఇలా: వంటనూనెల్లో ప్రధానంగా 'ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్(Tri-Ortho-Cresyl-Phospate)' అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్. ఇది కలిసిన నూనె వాడటం వల్ల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి పక్షవాతం సహా ఇతర రోగాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే మనం వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీదో కేవలం ఓ చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేంటంటే..
- ముందుగా రెండు మి.లీ. నూనెను ఓ చిన్న పాత్రల్లోకి తీసుకోవాలి.
- అందులో కరిగినది కాకుండా గట్టిగా పసుపు రంగులో ఉన్న బటర్ వేయాలి.
- కొద్దిసేపటి తర్వాత పాత్రలోని నూనె రంగు మారకుండా ఉంటే అది స్వచ్ఛమైన నూనె అని గుర్తించాలి. అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్ లేదని అర్థం.
- అదే నూనె ఎరుపు రంగు మారితే అది కల్తీ అయినట్లని.. దానిని ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు.