Pot Gardening Tips:గార్డెనింగ్.. ఇప్పుడిది చాలా మందికి ఫేవరెట్‌గా మారిపోయింది. మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఇంటి అవసరాల కోసం చాలా మంది తమ ఇళ్లలో రకరకాల మొక్కలను పెంచుతుంటారు. ఇక ఇంట్లో ఎక్కువ స్థలం ఉన్న వారు మినీ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకుంటే.. తక్కువ స్థలం ఉన్న వారు కుండీల్లో నచ్చిన మొక్కల్ని పెంచుకుంటుంటారు. ఇలా కుండీల్లో మొక్కలు పెంచే పద్ధతిని కంటెయినర్ గార్డెనింగ్ లేదా పాట్ గార్డెనింగ్ అని పిలుస్తున్నారు నిపుణులు. అయితే ఈ గార్డెనింగ్ పద్ధతి పాటించే వారు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సైజును బట్టి: ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు మొక్కలు పెంచుకోవాలంటే కుండీ తప్పనిసరి. అయితే వీటిలోనూ ఇతర మెటీరియల్స్‌తో తయారుచేసినవి లభిస్తున్నాయి . మట్టి, ప్లాస్టిక్, టెర్రకోటా, పింగాణీ, చెక్క, లోహాలతో చేసిన కుండీలు రకరకాల ఆకృతులు, సైజుల్లో లభిస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకునే ముందు మొక్క పెరిగే సైజును దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అంటే కొన్ని మొక్కలు వృక్షంలా పెరగచ్చని.. మరికొన్నింటికి వేర్లు ఎక్కువగా రావచ్చంటున్నారు. ఇలాంటప్పుడు కొన్ని రోజులకే ఆ వేర్లు విస్తరించి కుండీ పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి.. మొక్క పెరిగే విధానాన్ని బట్టి కుండీని ఎంచుకోవాలంటున్నారు. అలాగే ఆ కుండీలోని నీళ్లు బయటికి పోవడానికి రంధ్రం ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.
ఈ మొక్కలు: కుండీలు ఉంటే చాలు అన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చని భావించి.. చాలా మంది అలంకరణ మొక్కలూ పెంచుకుంటారు. అయితే అన్ని రకాల ఆర్నమెంటల్ పూల మొక్కలు కుండీల్లో పెంచుకోవడం వీలు కాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు..Thunbergia, Russelia .. లాంటి మొక్కలు గుబురుగా విస్తరిస్తాయని.. ఇలాంటి వాటిని కుండీల్లో పెంచితే ఇతర మొక్కలకు ఇబ్బంది కలగి.. ఆ ప్రదేశం చిత్తడిగానూ మారచ్చంటున్నారు. అందుకే ఈ తరహా మొక్కల్ని ప్లేస్ ఎక్కువ ఉన్న గార్డెన్‌లో పెంచుకుంటే అక్కడి వాతావరణం కలర్‌ఫుల్‌గా, ఆహ్లాదకరంగా మారుతుందంటున్నారు.
మట్టి ముఖ్యం: సాధారణ గార్డెనింగ్‌లో పెంచుకునే మొక్కలకు భూమి నుంచి కావాల్సిన పోషకాలు అందుతాయి. అదే కుండీల్లో పెంచుకునే మొక్కలకు అందులో నింపే మట్టే కీలకం. కాబట్టి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎర్ర మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, నాచు.. వంటివన్నీ కలిపి తయారుచేసిన నేచురల్ పాటింగ్ మిక్స్ మార్కెట్లో దొరుకుతుందని.. దాన్ని కుండీల్లో నింపుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయని.. తద్వారా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని అంటున్నారు.