How to Make Palak Meal Maker Bhurji :పాలకూర.. ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో ఒకటి. అయితే.. చాలా మంది దీన్ని నేరుగా తినాలంటే ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు ఇలా ఓసారి "పాలక్ సోయా బుర్జీ" ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉండడమే కాదు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. పైగా దీనికోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా తక్కువ సమయంలో ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ, పాలక్ సోయా బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- సోయా గ్రాన్యూల్స్ - ఒక కప్పు
- పాలకూర తరుగు - 3 కప్పులు
- నూనె - 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - పావు టీస్పూన్
- వెల్లుల్లి తరుగు - 3 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
- పచ్చిమిర్చి - 3
- పసుపు - పావు టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
- వేయించిన ధనియాల పొడి - 1 టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- కసూరి మేతి - కొద్దిగా
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో వేడి నీరు తీసుకొని సోయా గ్రాన్యూల్స్ వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ సోయా గ్రాన్యూల్స్ అనేవి అన్ని సూపర్ మార్కెట్స్‌లో, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
- ఒకవేళ అవి లేనివారు.. సోయా చంక్స్(మీల్ మేకర్స్) నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకొని వాడుకోవచ్చు. కానీ, సోయా గ్రాన్యూల్స్ వాడితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది.
- అవి నానేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే.. పాలకూరను సన్నని తరుగులా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక.. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆనియన్స్ వేగి కాస్త మెత్తగా మారాయనుకున్నాక.. ముందుగా నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్‌ని చేతితో గట్టిగా నీరు పిండేసి అందులో వేసుకోవాలి.
- ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూడు నాలుగు నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని పాలకూర తరుగు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ పాలకూరలోని పసరు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందుకు.. 8 నుంచి 10 నిమిషాల సమయం పట్టొచ్చు.
- ఆవిధంగా వేయించుకున్నాక.. అందులో పసుపు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మరికాసేపు వేయించుకోవాలి.
- అలా వేయించుకునేటప్పుడు.. కర్రీ అడుగంటుతుంటే 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అప్పుడు అడగు పట్టకుండా మిశ్రమం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది.
- ఆ తర్వాత.. కాస్త కసూరి మేతిని చేతితో నలిపి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక చివరగా దింపే ముందు.. నెయ్యి వేసుకొని మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి దింపుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే ఘుమఘుమలాడే "పాలక్ సోయా బుర్జీ" రెడీ!
- దీన్ని వేడివేడి అన్నం, చపాతీలలో కలుపుకుని తింటుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.