తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నట్స్ తొందరగా పాడవుతున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తూ స్టోర్​ చేస్తే నెలల పాటు ఫ్రెష్​! - TIPS TO STORE NUTS FOR LONG TIME

-ఆరోగ్యానికి మేలు చేసే నట్స్​ -ఇలా స్టోర్​ చేసుకుంటే నెలల పాటు ఫ్రెష్​

Nuts Storage Tips
Tips to Store Nuts Fresh for Long Time (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 12:25 PM IST

Tips to Store Nuts Fresh for Long Time:జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌, పల్లీలు.. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించేవే. అందుకే చాలా మంది వీటిని తమ డైట్​లో భాగం చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువ మొత్తంలో నట్స్‌ని కొనేస్తుంటారు. అయితే ఫైబర్‌, ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియం, మంచి కొవ్వులు.. ఇలాంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్న నట్స్‌ని సరైన పద్ధతిలో నిల్వ చేసినప్పుడే వాటిలోని ఈ పోషకాలన్నీ తరిగిపోకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాడవటానికి కారణాలు ఇవే: కొన్నిసార్లు నట్స్​కొని ఇంటికి తెచ్చిన కొన్ని రోజులకే పాడైపోతుంటాయి. వాటి నుంచి అదో రకమైన వాసన రావడంతో పాటు.. రుచిలోనూ తేడా కనిపిస్తుంది. అయితే వీటన్నింటికి కారణం.. వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడమే అంటున్నారు నిపుణులు. సాధారణంగా పప్పు గింజల్లో(జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌, పిస్తా) నూనెలు, మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటికి గాలి, వేడి, వెలుతురు తగలడం వల్ల ఆక్సిడేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అవి పాడైపోయి.. రుచిని కోల్పోతాయి.. వాటిలోని పోషకాలూ తరిగిపోతాయి. ఇక తేమ తగిలితే వీటిపై శిలీంధ్రాలూ వృద్ధి చెందుతాయి. కాబట్టి వాటిని సరైన పద్ధతిలో స్టోర్​ చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఎలా నిల్వ చేయాలంటే..

  • పప్పులు, ఉప్పు, కారం వంటివి ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం చేస్తుంటారు. ఈ చిట్కా నట్స్‌/డ్రైఫ్రూట్స్‌కీ సరిపోతుందంటున్నారు నిపుణులు. మనం స్టోర్​ చేయడానికి యూజ్​ చేసే గాజు సీసా అయినా ప్లాస్టిక్ జార్‌ అయినా మూత గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా గాలి చొరబడని డబ్బాలో వీటిని నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయంటున్నారు.
  • కొంతమంది ప్యాకెట్లలోని నట్స్‌ని వాడి.. ఈ ప్యాకెట్స్‌ని అలాగే భద్రపరుస్తుంటారు. అయితే వాటిలోకి గాలి చొరబడకుండా ఉండాలంటే సీలింగ్‌ క్లిప్స్‌ని యూజ్​ చేయమంటున్నారు. అవసరమైనప్పుడు వీటిని తెరిచి, ఆపై తిరిగి అమర్చుకోవడం ఈజీ అవుతుందని చెబుతున్నారు. అలాగే నట్స్‌కి గాలి తగలకుండానూ జాగ్రత్తపడవచ్చంటున్నారు.
  • నట్స్‌ని నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలనుకునే వారు.. చల్లగా, పొడిగా, చీకటిగా ఉండే ప్రదేశంలో వీటిని ఉంచడం వల్ల దాదాపు మూడు నెలల పాటు తాజాగా ఉంటాయంటున్నారు.
  • కొంతమంది ఎక్కువ మొత్తంలో నట్స్‌ని కొని.. నెలల తరబడి ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారు వీటిని నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్‌ని వాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అందుకు.. నట్స్​ను గాలి చొరబడని డబ్బాలో ఉంచి సాధారణ ఫ్రిజ్‌లో పెడితే ఇవి కనీసం ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయంటున్నారు నిపుణులు. అదే ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే సంవత్సరం పాటు తాజాగా ఉంటాయట.
  • ఫ్రిజ్‌లో ఉంచినా మసాలాలు, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలకు దూరంగా నట్స్​ను భద్రపరచాలంటున్నారు. ఎందుకంటే ఆ వాసనను ఇవి పీల్చుకుని.. త్వరగా పాడవుతాయట. అందుకే గాజు సీసాలో మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో పెట్టడం మేలంటున్నారు నిపుణులు. ఇక వీటిని యూజ్​ చేసేందుకు.. ఫ్రిజ్‌లో నుంచి బయటికి తీసినా.. గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాకే జార్ మూత తెరవాలని.. అప్పుడే బయటి గాలి, వేడి, తేమ.. వంటివి వెంటనే వాటికి తగలకుండా, తద్వారా అవి పాడవకుండా ఉంటాయంటున్నారు.
  • సాధారణ నట్స్‌ కంటే షెల్స్‌లో ఉన్న నట్స్‌ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటికి గాలి, వేడి, తేమ తగలకపోవడమే కారణమంటున్నారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో నట్స్‌ కొనాలనుకునే వారు షెల్స్‌తో ఉన్నవి కొనడం మంచిదంటున్నారు.
  • ఎంత జాగ్రత్తగా భద్రపరిచినా.. నట్స్‌ తాజాగా ఉన్నాయా, లేదో తెలుసుకునేందుకు మధ్య మధ్య వాటిని చెక్‌ చేసుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో వాటి రంగు, రుచి, వాసన మారినట్లుగా గుర్తిస్తే వాటిని బయట పడేయడమే ఉత్తమమట. ఇక నట్స్‌ని కొనే ముందు.. వాటి ప్యాకింగ్‌, ఎక్సపైయిరీ డేట్​ లేబుల్స్​ను ఒకటికి రెండుసార్లు పరిశీలించడం ముఖ్యమని సలహా ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details