How to Make Nellore Ghee Karam Dosa :ఎక్కువ మంది బ్రేక్‌ఫాస్ట్‌లో ఇష్టపడే టిఫెన్స్లో ఒకటి.. దోశ. ఈ టేస్టీ సౌత్ ఇండియన్ టిఫెన్‌కు మంచి గిరాకీ ఉంటుంది. అయితే, దోశలలో రకరకాల వెరైటీలు ఉంటాయి. అందులో చాలా మంది ఇప్పటి వరకు ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, రవ్వ దోశ, పోహా దోశ(Poha Dosa).. వంటి వాటిని టేస్ట్ చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా నెల్లూర్ ఫేమస్ నెయ్యి కారం దోశను రుచి చూశారా? దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ. మరి, ఈ సూపర్ టేస్టీ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- మినప పప్పు - 1 కప్పు
- బియ్యం - 3 కప్పులు
- మెంతులు - 1 టీస్పూన్
- శనగపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- అటుకులు - పావు కప్పు
కారంపొడి కోసం :
- ఎండుమిర్చి - 10
- ఉప్పు - రుచికి సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఉల్లిపాయ - 2
పల్లీ చట్నీ కోసం :
- పల్లీలు - 1 కప్పు
- పచ్చిమిర్చి - 6
- వెల్లుల్లి రెబ్బలు - 5
- చింతపండు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్లో మినప పప్పు, బియ్యం, మెంతులు, శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరో బౌల్లో అటుకులను కడిగి మంచినీళ్లు పోసుకొని 6 గంటలపాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి బియ్యం, మినపప్పు మిశ్రమంతో పాటు నానబెట్టుకున్న అటుకులు, కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై పిండిని గిన్నెలోకి తీసుకొని చేతితో రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. వాతావరణం చల్లగా ఉంటే పిండి పులియడానికి కాస్త టైమ్ పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- పిండి పులిసిన తర్వాత దాన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆపై ఓ గిన్నెలోకి కావాల్సిన మొత్తంలో తీసుకుని.. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే, పిండి అనేది మరీ మందంగా, పల్చగా ఉండకుండా చూసుకోవాలి.
- ఇప్పుడు ఎర్రకారం కోసం వేడినీటిలో ఎండుమిర్చిని ఓ 15 నిమిషాలు నానబెట్టాలి.
- ఎండుమిర్చి నానిన తర్వాత.. మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానబెట్టిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కాస్త పెద్ద సైజ్‌లో తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత పల్లీలను, పచ్చిమిర్చిని వేయించుకొని చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. అందులో సగం చట్నీని గట్టిగా ఉంచుకొని, మిగతా చట్నీని కాస్త వాటర్ కలుపుకొని దోశలు తినడానికి రెడీ చేసుకోవచ్చు.
- ఇప్పడు స్టౌ ఆన్ చేసి దోశ పెనం పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్ లేదా కాటర్ క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి.
- అనంతరం మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి కొద్దిగా దోశ పిండిని వేసుకుని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- దోశపై తడి ఆరిపోయేంత వరకు ఉడికించుకున్నాక దానిపై రెండు టీస్పూన్ల గట్టి పల్లీ చట్నీ, ఒక టీస్పూన్ ఎర్రకారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ మిశ్రమాన్నంతా దోశ మెుత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేలా గరిటెతో రుద్దుకోవాలి.
- ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దోశ అన్ని వైపులా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "నెల్లూర్ నెయ్యి కారం దోశ" రెడీ!
ఇవీ చదవండి :
నోరూరించే "పాలకూర దోశ" - ఆకుకూరలు తినని వారికి బెస్ట్ ఛాయిస్ - ప్రిపరేషన్ వెరీ ఈజీ!
దోశలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటిస్తూ వేస్తే సూపర్ క్రిస్పీతో పాటు టేస్ట్ అద్దిరిపోతాయి!