Natural Cleaning Methods : సాధారణంగా ప్రతి ఇంట్లో దుస్తులు ఉతకడానికి, అలాగే గిన్నెలు తోమడానికి రకరకాల సోప్‌లు వాడుతుంటాం. వేటి కోసం అవే ప్రత్యేకమైన సబ్బులు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, సబ్బుతో అన్ని రకాల దుస్తులను ఉతకకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సబ్బుతో కొన్ని రకాల గిన్నెలు కూడా శుభ్రం చేయకూడదని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉన్ని దుప్పట్లు, దుస్తులు :ఉన్ని దుస్తులను సబ్బుతో శుభ్రం చేయకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని సబ్బుతో ఉతికితే అవి ముడుచుకుపోయి.. పాత వాటిలా కనిపిస్తాయి. ఇంకా వాటి లైఫ్ టైం కూడా తగ్గుతుందని అంటున్నారు. కొంతమంది బాగా శుభ్రపడతాయనే ఉద్దేశంతో ఉన్ని దుస్తులను గంటల తరబడి డిటర్జెంట్ పౌడర్‌లో నానబెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఉన్ని త్వరగా దెబ్బతింటుంది. కాబట్టి, ఉన్ని దుస్తులను డిటర్జెంట్ పౌడర్ కలపని నీటిలో మాత్రమే పూర్తిగా మునిగేలా నాననివ్వాలి.
పట్టు చీరలు :మహిళలకు పట్టుచీరలంటే ఎంతో ఇష్టం. అయితే వాటిని కట్టుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ సబ్బుతో ఉతకకూడదంటున్నారు. ఇలా చేస్తే వాటి రంగు, మన్నిక దెబ్బతింటుందని అంటున్నారు. వాటిని ఉతకడం కోసం ప్రత్యేకమైన లిక్విడ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని.. వాటిని ఉపయోగిస్తే మంచిదంటున్నారు. లేకపోతే వాటిని డ్రై వాష్‌కు ఇస్తే బెటర్ అని వివరిస్తున్నారు.
ఇనుప గిన్నెలు :ఈ మధ్యకాలంలో చాలా మంది క్యాస్ట్ ఐరన్ పాత్రల్ని ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిని సబ్బుతో శుభ్రం చేయకూడదట. ఎందుకంటే.. సోప్‌తో క్లీన్ చేయడం వల్ల ఆ గిన్నెలకి ఉండే నాన్‌స్టిక్ ప్రాపర్టీస్ పోయి.. మనం కుక్ చేసే పదార్థాలన్నీ వాటికే అతుక్కుంటాయంటున్నారు. ఇంకా సబ్బుతో వాటిని శుభ్రం చేయడం వల్ల తుప్పు పట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. కాబట్టి, వీటిని సబ్బుకు బదులుగా.. ఇతర పదార్థాలను ఉపయోగించి క్లీన్ చేయాలంటున్నారు. వీటిని క్లీన్ చేయడం కోసం.. ఒక పాత్రలో టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడా, నిమ్మరసం, కొన్ని వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత మిశ్రమంలో స్క్రబ్బర్ ముంచి పాత్రలను బాగా రుద్దాలి. ఆపై నీటితో క్లీన్ చేస్తే సరి. ఐరన్ పాత్రలపై జిడ్డు, మరకలు పోయి తళతళా మెరుస్తాయి. ఇంకా ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయి.