తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బళ్లారి స్టైల్ మిరియాల పప్పుచారు - కారం లేకుండానే అదిరే ఘాటు - రుచి చూడాల్సిందే! - BALLARI MIRIYALA PAPPU CHARU

- అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్​ లెవల్!

Miriyala pappu charu recipe
Miriyala pappu charu recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 2:54 PM IST

Miriyala pappu charu recipe : పప్పు చారు ఎన్నో రకాలుగా చేస్తారు. మీకు కూడా ఎన్నో వెరైటీలు తెలిసి ఉంటాయి. మరి, బళ్లారి స్టైల్ మిరియాల పప్పు చారు గురించి మీకు తెలుసా? ఇందులో స్పెషాలిటీ ఏమంటే, కారం వాడకుండా మిరియాలతోనే పప్పు చారుకు అద్దిరిపోయే ఘాటు తీసుకొస్తారు! మరి, ఈ సూపర్​ టేస్టీ పప్పు చారు ఎలా చేయాలి? ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

పప్పు ఉడికించడానికి కావాల్సిన పదార్థాలు:

1/2 కప్పు కందిపప్పు (30 నిమిషాలు నానబెట్టాలి)

1-1/2 కప్పు నీళ్లు

1/4 టీస్పూన్ పసుపు

మిరియాల మసాలా పొడి కోసం:

1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు

1/2 టీస్పూన్ జీలకర్ర

2 చిటికెలు మెంతులు

2 టీస్పూన్లు ధనియాలు

1 ఎండు మిరపకాయ (రుచి కోసం, కారం కోసం కాదు)

తాలింపు కోసం:

1-1/2 టేబుల్ స్పూన్ నెయ్యి

1/2 టీస్పూన్ ఆవాలు

1 ఎండు మిరపకాయ

1/2 టీస్పూన్ మినపప్పు

1/2 టీస్పూన్ జీలకర్ర

1 పచ్చి మిరపకాయ (ఆప్షనల్, కొంచెం రుచి కోసం, కారం కోసం కాదు)

1/8 టీస్పూన్ ఇంగువ

2 రెమ్మల కరివేపాకు

పప్పు చారు కోసం:

1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు

1 టమోటా (ముక్కలు చేసుకోవాలి)

1 కప్పు చింతపండు రసం (నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్లలో నానబెట్టి తీయాలి)

1 లీటరు నీళ్లు

కొత్తిమీర (సన్నగా తరిగినది)

ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా కందిపప్పుని కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత పప్పు కుక్కర్​లో వేసి, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. అందులో పసుపు వేసి మూత పెట్టి, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకొని, పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిరియాల మసాలా పొడి తయారుచేసుకోవాలి. దీనికోసం పాన్ లో మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండు మిరపకాయ వేసి మిరియాలు చిటపటలాడే వరకు వేయించాలి.
  • కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • తాలింపు కోసం ఒక మందపాటి పాన్‌లో నెయ్యి వేడి చేసి, ఆవాలు, ఎండు మిరపకాయ వేసి ఆవాలు చిటపటలాడనివ్వాలి.
  • తర్వాత మినపప్పు, జీలకర్ర, పచ్చి మిరపకాయ వేసి, ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి.
  • ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి.
  • కొంచెం వేగిన తర్వాత తరిగిన టమాటా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
  • ఆ తర్వాత కప్పు చింతపండు రసం పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి.
  • ఇప్పుడు గ్రైండ్ చేసిన మిరియాల మసాలా పొడి వేసి, కొన్ని నిమిషాలు ఉడికించాలి.
  • తర్వాత మెదిపిన పప్పు వేసి, లీటరు నీళ్లు పోసి, మీడియం మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. అవసరమైతే ఉప్పు, నీళ్లు యాడ్ చేసుకోవాలి.
  • చివరిగా, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే సరి. అద్దిరిపోయే పప్పు చారు మీ ముందు ఉంటుంది.
  • అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ చారుతో తింటే అద్దిరిపోద్దంటే నమ్మాల్సిందే.

ఇవి కూడా చదవండి :

వేడి వేడి "మిరియాల చారు" - దగ్గు, జలుబుకు చక్కటి మందు

సూపర్ టేస్టీ : 10 నిమిషాల్లో టమాటా మిరియాల రసం - ఇలా ప్రిపేర్ చేస్తే ఒట్టి రసం కూడా తాగేస్తారు!

ABOUT THE AUTHOR

...view details