Swarna Shatabdi Express Owner Details:సాధారణంగా అత్యంత సంపన్నులైన వ్యక్తులు, ఫేమస్ సెలబ్రిటీల పేరు మీద విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు, షిప్లు వంటివి ఉన్నట్లు వింటుంటాం.. చదువుతుంటాం. కానీ, ఒక రైలుకు ఫలనా వ్యక్తి యజమాని అని మీరెప్పుడైనా విన్నారా? విని ఉండరు. ఎందుకంటే మన దేశంలో అది సాధ్యం కాదు. భారతీయ రైల్వేలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే కొనసాగుతున్నాయి. అయితే గతంలో రైల్వే అధికారులు చేసిన ఒక పొరపాటుతో స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు(Swarna Shatabdi Express)కు ఒక రైతు కొన్నాళ్లు యజమానిగా ఉండాల్సి వచ్చింది. రైల్వే చరిత్రలోనే ఇది ఒక అసాధారణ ఘటన. ఆ వివరాలు మీకు తెలుసా? ఇంతకీ ఎవరా రైతు? ఏంటా కథ? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఒక సాధారణ రైతు.. రైలుకు యజమాని అయిన ఈ అసాధారణ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే.. 2007లో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన తప్పిదమే ఈ ఘటనకు కారణం. లుథియానాలోని కటానా అనే గ్రామంలో భూసేకరణ కోసం రైతులకు ఎకరానికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, కొన్ని సంవత్సరాలకు తమ సమీప గ్రామంలో ఎకరానికి రూ.71 లక్షలు చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూరణ్ సింగ్ అనే రైతు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించారు. తమకూ అంతే మొత్తంలో పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో రైల్వే శాఖ ఎకరానికి పరిహారాన్ని రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంచింది.. అయినా ఆ రైతు వెనక్కి తగ్గకపోవడంతో ఆపై పరిహారం రూ.1.47కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్తన్ రైల్వే 2015 లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ రైల్వే అధికారులు చెల్లించలేదు.