Lucky Foods New Year 2025:ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చి గత ఏడాది(2024) అస్తమించింది. ఆ మధుర జ్ఞాపకాల్ని స్మరించుకుంటూ డిసెంబర్ 31 వేడుకులను అందరూ ఆనందంగా జరుపుకున్నారు. అలాగే కొత్త ఆశల రెక్కలు విచ్చుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు. అయితే, జీవితంలో మారేది క్యాలెండర్ మాత్రమే అయినా.. అందరూ తమ జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటారు. ఏడాదంతా ఫుల్ హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తారు. ఈ క్రమంలోనే ఉదయాన్నే ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ రోజంతా (జనవరి 1) కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. అయితే, కొత్త ఏడాదిలో మొదటి రోజున కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల అదృష్టం కలిసిసొస్తుందని ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రజలు నమ్ముతారు. మరీ న్యూ ఇయర్ రోజున లక్‌ని ప్రసాదించే ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కేకులో కాయిన్ :ఇంట్లోనైనా, పార్టీలోనైనా.. 31st నైట్ కేకు కట్ చేయకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తవవు. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేస్తేనే ఫుల్ జోష్. అయితే, ఇలా కేక్ కట్ చేస్తే అదృష్టం వరిస్తుందని గ్రీకువాళ్లు నమ్ముతారు. కానీ, ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. వారు కేక్ చేసేటప్పుడు అందులో కొన్ని నాణేలనీ ఉంచుతారట. కట్ చేసిన కేకు ముక్కలో కాయిన్స్ ఎవరికి దొరికితే వారికి ఏడాదంతా సిరిసంపదలకు కొదవే ఉండదని నమ్ముతారు. అలాగే వారు ఎక్కువగా తులసిని వేసి చేసిన కేక్ ఇష్టపడతారట!
నూడుల్స్ అంటే ఇష్టమా?మనలో చాలా మందికి నూడుల్స్ అంటే ఎంతో ఇష్టం. పిల్లలు, పెద్దలు.. ఎవరైనా ప్లేట్లో ఇలా వేసివ్వగానే లొట్టలేసుకుంటూ మొత్తం లాగించేస్తారు. మీరు నూడుల్స్ లవర్ అయితే, ఈ రోజున తప్పకుండా నూడుల్స్ తినండి. ఎందుకంటే.. ఒకదాన్ని తెగకుండా తింటే.. ఏడాదంతా ఆనందం, ఆరోగ్యంతో నిండిపోతుంది! ఈ పద్ధతిని న్యూ ఇయర్ రోజు చైనీయులు ఫాలో అవుతారు.
12 ద్రాక్ష పండ్లు :అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కొట్టే సమయానికి స్పెయిన్ ప్రజలు 12 ద్రాక్ష పండ్లని తింటారు. పన్నెండు నెలలకి ఆ 12 పండ్లు గుర్తు అన్నమాట. అలా తింటే ఏడాది పొడవునా అదృష్టం వరిస్తుందని స్పానిష్ వాళ్లు విశ్వసిస్తారు.