తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

'భర్తతో విడిపోయాను - మాకు ఒక్కడే వారసుడు - ఆస్తి వస్తుందా?' - LEGAL ADVICE IN TELUGU

- విడాకుల అనంతరం ఆస్తి హక్కులపై మహిళ సందేహాలు - న్యాయనిపుణులు ఇచ్చిన సలహా ఇదే!

Legal Advice For Property Distributions
Legal Advice For Property Distributions (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 3:16 PM IST

Legal Advice For Property Distributions : ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య ఎక్కువగా ఉంది. పలు రకాల కారణాలతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి డివోర్స్​ తీసుకుంటున్నారు. ఇలాంటి ఒక కేసు గురించి ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం.

"అత్తింటివాళ్ల వేధింపులు భరించలేక బాబుకి అయిదేళ్లు ఉన్నప్పుడు డివోర్స్​ తీసుకున్నా. వాళ్లు కట్నం తీసుకున్నారు. నా నగలు కూడా తిరిగి ఇవ్వలేదు. కానీ బాబు పేరిట రెండెకరాలు రాశారు. నేను భరణము కూడా కోరలేదు. బాబు బాధ్యతంతా నేను ఒక్కదాన్నే తీసుకున్నా. ప్రస్తుతం బాబుకి 19 ఏళ్లు. రెండేళ్ల క్రితం మా బాబు ఊరెళితే మా అత్తగారు 'నా దగ్గర మూడు స్థలాలున్నాయి. అవి నీకే' అని పెద్దవాళ్ల ముందు అన్నారట. కానీ ఆ మాట లిఖితపూర్వకంగా జరగలేదు. ఇప్పుడు మా అత్తగారు చనిపోయారు. ఇప్పుడది మా బాబుకి వస్తుందా? ఆ ఇంటికి మా అబ్బాయి ఒక్కడే వారసుడు. ఆడపడుచులకు ఇద్దరమ్మాయిలు ఉన్నారు"అని ఓ సోదరి న్యాయ నిపుణులను సలహా అడిగారు. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి.వరలక్ష్మి ఎలాంటి ఆన్సర్​ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

మీ అత్తగారి నోటి మాటలకు విలువ ఉండదు. ఏదైనా ఆస్తికి సంబంధించిన పంపకాలు రాతకోతల ద్వారానే పూర్తిగా జరగాలి. మీ అబ్బాయి పేరున రాసిన రెండు ఎకరాలూ అతనికే చెందుతాయి. ఇప్పుడు మీ అత్తగారు చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరి పేరు మీద ఉంది అనే దాని ఆధారంగా.. మీ అబ్బాయికి వస్తుందా రాదా? అన్నది చెప్పగలం. మగపిల్లాడు అయినంత మాత్రాన మీ అబ్బాయి ఒక్కడే వారసుడు అనుకుంటే సరిపోదు.

"హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 15 ప్రకారం.. హిందూ స్త్రీ ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే.. ఆవిడ ఆస్తి ముందుగా కొడుకులకు, కూతుళ్లకు, భర్తకు సమానంగా వస్తుంది. మీరు విడాకులు తీసుకున్న తర్వాత మీ భర్త రెండో పెళ్లి చేసుకోకపోయినా, రెండో పెళ్లి ద్వారా అతడికి సంతానం కలగకపోయినా.. మీ భర్త బతికి ఉంటే.. అతడితో పాటు తన అక్క చెళ్లెల్లు కూడా వారసులవుతారు."-జి.వరలక్ష్మి (ప్రముఖ న్యాయవాది )

వారిలో ఎవరయినా మరణిస్తే వారి భాగం వారసులకు చెందుతుంది. మీ ఆయన వాటా అతనికి పిత్రార్జితం అవుతుంది. తనకు వచ్చిన ఆ ఆస్తిని తన పిల్లలతో పంచుకోవాలి.

అంతేకానీ మీ ఆడపడుచుకిఆడపిల్లలు ఉన్నంత మాత్రాన వాళ్లకు ఆస్తి హక్కు లేదు అనలేం. మీ ఆడపడుచులు మీ ఆయనతో కలిసి సమానంగా ఆస్తి పొందగలుగుతారు. ఒకవేళ మీ అత్తగారు అన్నమాట ప్రకారం మీ బాబు పేరు మీద తన ఆస్తిని వీలునామా రాయడమో, గిఫ్ట్‌ డీడ్‌ చేయడమో చేశారమో ముందుగా తెలుసుకోండి. అసలు ఆస్తి మీ అత్తగారి పేరు మీద ఉందో లేదో తెలుసుకోండి. మీ ఆయన, ఆడపడుచులు సమానంగా ఆస్తిని పంచుకున్నప్పుడు తన భాగాన్ని స్వార్జితపు ఆస్తికింద పరిగణిస్తారు. ముందు మీ బాబుని తండ్రికి దగ్గరయ్యేలా చూడండి అని సమాధానం ఇచ్చారు.

Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆడపిల్లలకు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉండదా? - న్యాయ నిపుణుల సమాధానమిదే!

'నా భర్త మరణించాడు - ఆయన సంపాదించిన ఆ ఆస్తిలో మా పిల్లలకు వాటా ఉంటుందా?'

ABOUT THE AUTHOR

...view details