Healthy Diet for New Mothers: మహిళలు గర్భం ధరించినప్పటి నుంచీ బిడ్డ పుట్టే దాకా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరమని ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ కే. అరుణ చెబుతున్నారు. ఈ సమయంలో సరిగ్గా ఆహారం తీసుకోకపోతే భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులు, ఎముకల బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం 45 ఏళ్ల తర్వాత కనిపిస్తుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
"శిశువు తనకు కావాల్సిన ప్రతి పదార్థాన్ని తల్లి నుంచి తీసుకుంటుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఆహారంలో తక్కువగా ఉంటే.. తల్లి శరీరంలోని ఖనిజాలను బిడ్డ తీసుకుంటుంది. ఫలితంగా తల్లికి ఉండాల్సిన మోతాదులో కాల్షియం, ఐరన్ ఉండక ఆరోగ్యం దెబ్బతింటుుంది. ముఖ్యంగా తొలిసారి ప్రసవం జరిగిన సమయంలో అన్ని పోషకాలు అందేలా చూసుకోవాలి. ఉదయం టిఫిన్లలోకి ఇడ్లీ, సాంబార్, మధ్యాహ్నానికి కొర్రలు, జొన్నలతో అన్నం, బ్రౌన్ రైస్, చపాతీ లాంటివి తీసుకోవాలి. ఆకుకూరలోని విటమిన్ బీ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇంకా ప్రోటీన్లు, కేలరీలు, విటమిన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తొలి ఆరు నెలల్లో తప్పనిసరిగా ఎక్కువ కేలరీలు తీసుకోవాలి."
డాక్టర్ కే. అరుణ, క్లినికల్ న్యూట్రిషనిస్ట్
- కొర్రలు, జొన్నలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
- ఎండు ద్రాక్షలు, నట్స్‌ను ముఖ్యంగా బెల్లంతో కలిపి తీసుకుంటే సూపర్ ఫుడ్‌లా మారి పాల ఉత్పత్తిని బాగా పెంచుతుందని అంటున్నారు.
- వెల్లుల్లి పాయను కూరల్లో ఎక్కువగా వాడడం వల్ల కూడా మెరుగైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
- చేపలు, గుడ్లు, మటన్, చికెన్ లాంటి ఆహారం తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుందని వివరిస్తున్నారు.
- కార్బో హైడ్రేట్స్ అధికంగా ఉండే పల్లీలు, కొబ్బరి ఉండలు లాంటి ప్రోటీన్ పదార్థాలు ఇవ్వడం వల్ల సహజంగానే పాల ఉత్పత్తిని పెంచుతుందని అంటున్నారు.
- ఇలాంటి ఆహారం వారంలో నాలుగు రోజులు ఉండేలా చూసుకోవాలని డాక్టర్ అరుణ సూచిస్తున్నారు. ఈ సమయంలో సమతుల ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ ఫేస్‌పై మచ్చలు పోవట్లేదా? ఇది రోజుకొకసారి రాస్తే చాలు అంతా క్లీన్!
చెప్పులు లేకుండా నడుస్తున్నారా? హర్మోన్ ఇంబ్యాలెన్స్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు!