How to Make Thotakura Gatti Garelu:తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే తోటకూరతో వంటలు అనగానే తోటకూర పప్పు, తోటకూర వేపుడు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అయితే.. వీటితో గారెలు కూడా చేసుకోవచ్చు. వీటినే తోటకూర గట్టి గారెలు అంటారు. దక్షిణాదిలోని చాలా ప్రాంతాల్లో ఈ గారెలు చాలా మందికి సుపరిచితమే. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం..
తోటకూర గట్టి గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు:
- శనగపప్పు - ఒక కప్పు
- మినప్పప్పు - అర కప్పు
- తోటకూర తరుగు - 1 కప్పు
- ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
- వెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్ స్పూన్
- అల్లం తరుగు - ఓ టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- సోంపు లేదా జీలకర్ర - 1 టీ స్పూన్
- నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్లోకి శనగపప్పు, మినప్పప్పు వేసి నీళ్లతో శుభ్రంగా కడిగి ఓ నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
- అవి బాగా నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా జల్లెడలో వేసుకోవాలి.
- ఆ తర్వాత వాటిని మిక్సీజార్‌లోకి వేసి అవసరమైన మేరకు నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ పోసి రుబ్బుకుంటే గారెలు అంత రుచికరంగా ఉండవు. ఎందుకంటే పిండి జోరు అయితే గారెలు విరిగిపోతాయి. కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. అలా గ్రైండ్ చేసుకన్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఈలోపు తోటకూరను కాడలు లేకుండా సన్నగా తరిగి శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసి ఆ తరుగును పప్పు ముద్దలో వేసి కలుపుకోవాలి.
- అనంతరం అందులోకి ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, రుచికి సరిపడా ఉప్పు, సోంపు లేదా జీలకర్ర వేసి తోటకూరను గట్టిగా పిండుతూ కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి.
- అది వేడెక్కే లోపు ఓ అరటి ఆకు లేదా ఏదైనా కవర్ మీద కొద్దిగా నూనె రాసి పిండి ముద్దను కొద్దిగా తీసుకుని దాని మీద పెట్టి గారెలుగా ఒత్తి మధ్యలో కొద్దిగా రంధ్రం పెట్టాలి.
- నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకున్న గారెలను అందులో వేసుకోవాలి. కడాయి సైజ్‌ను బట్టి గారెలు వేసుకోవాలి.
- ఓ నిమిషంపాటు అలానే ఉంచి ఇప్పుడు స్టవ్‌ను మీడియంలో పెట్టి రెండు వైపులా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గారెలుగా చేసుకోవాలి.
- అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే తోటకూర గట్టి గారెలు రెడీ. వీటిని వేడివేడిగా ఓ కప్పు చాయ్‌తో కలిపి తీసుకుంటే కాంబినేషన్ అదుర్స్.
అటుకులతో అద్దిరిపోయే నగ్గెట్స్ - పిల్లలు వదలకుండా కుమ్మేస్తారు!
వావ్ అనిపించే రెస్టారెంట్ స్టైల్ "చిల్లీ గార్లిక్ చికెన్" - ఈజీగా చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!