Pulihora Podi Recipe in Telugu : పండగొచ్చినా, పబ్బమొచ్చినా, చుట్టాలొచ్చినా ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకునే రెసిపీలలో ముందు వరుసలో ఉంటుంది పులిహోర. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని చాలా ఇష్టంగానూ తింటారు. అయితే, అదే పులిహోరనుఇన్స్టంట్గా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఖాళీ టైమ్ ఉన్నప్పుడు ఇలా "పులిహోర పొడిని" తయారు చేసుకొని పెట్టుకుంటే చాలు. ఈ పొడిని కేవలం పులిహోరగానే కాకుండా బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోకి సైడ్ డిష్‌గానూ వేసుకొని తినొచ్చు. మరి, ఎంతో టేస్టీగా, పుల్ల పుల్లగా, కారంకారంగా ఉండే కమ్మని పులిహోర పొడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కశ్మీరీ ఎండుమిర్చి - 25 నుంచి 30
- కారం గల నార్మల్ ఎండుమిర్చి - 6
- శనగపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- మినప్పప్పు - 1 టేబుల్‌స్పూన్
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- మిరియాలు - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- మెంతులు - పావుటీస్పూన్
- నువ్వులు - 1 టేబుల్‌స్పూన్
- నూనె - 2 టీస్పూన్లు
- కరివేపాకు - పిడికెడు
- చింతపండు - 50 గ్రాములు
- పసుపు - పావుటీస్పూన్
- బెల్లం - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకోసం :
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- పల్లీలు - ముప్పావు కప్పు
- శనగపప్పు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- ఎండుమిర్చి - 5
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - చిటికెడు
- కొబ్బరి తురుము - 1 టేబుల్‌స్పూన్
నోరూరించే "రవ్వ పులిహోర" - కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని కశ్మీరీ రెడ్ చిల్లీ, కారం గల ఎండుమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఈ మిర్చి అందుబాటులో లేకపోతే కారం గల నార్మల్ ఎండుమిర్చిని ఒక 20 నుంచి 22 వరకు తీసుకున్నా సరిపోతుంది.
- తర్వాత అదే పాన్‌లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మరో 2 నిమిషాలు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఎండుమిర్చి ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టౌపై మళ్లీ అదే పాన్ పెట్టుకొని మెంతులను వేసి ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగాక నువ్వులను వేసి చిటపటమనే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసుకోవాలి. ఆపై అందులో తాజా కరివేపాకుని వేసుకొని మధ్యమధ్యలో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని పాన్ వేడిగా ఉండగానే అందులో నారలు, గింజలు తీసుకున్న చింతపండునివేసుకుని కాసేపు అలా వదిలేస్తే చింతపండు కూడా చక్కగా ఫ్రై అవుతుంది.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అలాగే పసుపు, బెల్లం, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అయితే, ఈ పొడిని బ్రేక్‌ఫాస్ట్‌లోకి ప్రిపేర్ చేసుకుంటే గ్రైండ్ చేసుకున్నాక చల్లార్చుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం 5 నుంచి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది!
ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ "అరిసెలు" చేసుకోండి - పర్ఫెక్ట్ టేస్ట్‌తో పొంగుతూ, సాఫ్ట్‌గా వస్తాయి!
- అదే పులిహోర పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- అవి వేగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాయనుకున్నాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేపుకోవాలి. ఇక చివర్లో కొబ్బరి తురుమూ వేసుకొని చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని అందులో మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పొడిని వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "ఇన్స్టంట్ పులిహోర పొడి" రెడీ!
- ఇలా చేసుకున్న పొడి పూర్తిగా చల్లారాక ఏదైనా డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజులు వాడుకోవచ్చు!
- దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె, రెండు టేబుల్స్పూన్ల పులిహోర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆపై అందులో ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే కమ్మని పులిహోర నిమిషాల్లో రెడీ అయిపోతుంది.
గుడిలోని ప్రసాదమంత టేస్టీ పులిహోర ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్ పాటిస్తే అద్భుత రుచిని అస్వాదిస్తారు!