Trump On Indian Tariffs : భారత్ అత్యధిక టారిఫ్‌లు విధించే దేశం అని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. వారి వద్ద చాలా డబ్బులు ఉన్నాయన్నారు. అందువల్ల భారత్‌లో ఓటింగ్ పెంచేందుకు అమెరికా ఫండింగ్ ఎందుకని ప్రశ్నించారు. అలా అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను డోజ్ రద్దు చేయడాన్ని ట్రంప్ సమర్థించారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మీడియా సమావేశంలో ఈ మేరకు ట్రంప్ మాట్లాడారు.
"ఇండియాకు మేమెందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి. వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ, వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది?" అని డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నల వర్షం కురిపించారు.
VIDEO | Addressing a press briefing at his Mar-a-Lago residence in Florida, US President Donald Trump (@realDonaldTrump) says, " ... $21 million for voter turnout in india. why are we giving $21 million to india? they got a lot more money. they are one of the highest taxing… pic.twitter.com/fX5lMoyu1S
— Press Trust of India (@PTI_News) February 19, 2025
భారత్‌తో పాటు ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న లిస్ట్ విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల ఈ విభాగం రద్దు చేసింది. బంగ్లాదేశ్, నేపాల్‌కు కేటాయించిన ఫండ్‌ను కూడా రద్దు చేసింది. డోజ్ తీసుకున్న నిర్ణయం భారత్‌లో రాజకీయ వివాదానికి తెరలేపింది.