Unusal Uses for Potatoes : బంగాళదుంపతో రకరకాల వంటకాలు చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ, చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆలూతో పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలించొచ్చు. ఇంకా ఫర్నిచర్ క్లీనింగ్ కూడా చేయొచ్చు. మరి, ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పాత్రల తుప్పు వదిలిస్తుంది!
వంటింట్లో ఐరన్, స్టీలు పాత్రలు వాడుతుంటాం. అయితే, అవి వాతావరణంలోని తేమ కారణంగా తుప్పు పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో బంగాళాదుంపను వాడడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మందపాటి ఆలూ స్లైస్‌ను తీసుకొని డిష్‌వాషింగ్ లిక్విడ్‌లో ముంచి లేదంటే వంట సోడాలో అద్ది పాత్రపై తుప్పు ఉన్న స్మూత్‌గా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత డిష్‌వాష్‌తో క్లీన్ చేసి పొడిగా తుడిచి ఆరబెడితే చాలు. పాత్ర తుప్పు వదలడమే కాకుండా కొత్తదానిలా మెరిసిపోతుందంటున్నారు నిపుణులు.
ఇక తుప్పు పట్టిన వంటింట్లోని కత్తులను మెరిపించడంలో కూడా బంగాళాదుంప చక్కగా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం ఒక ఆలూ ముక్కను తీసుకొని తుప్పు పట్టిన కత్తిపై రుద్దాలి. 5 నిమిషాలు ఆగి ఆ తర్వాత సాధారణ వాటర్‌తో కడిగి పొడిగా తుడిచేస్తే సరిపోతుందట.
మాడిన గిన్నెలకు మంచి పరిష్కారం!
వంట చేసే క్రమంలో ఒక్కోసారి గిన్నెలు మాడి అడుగంటుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆలూ మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు. అందుకోసం ఒక మందపాటి బంగాళాదుంప ముక్కను నిమ్మరసంలో ముంచి మాడిన ప్రదేశంలో స్క్రబ్ చేయండి. ఆపై 30 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత సబ్బు నీటితో నెమ్మదిగా రుద్ది కడిగేస్తే చాలు. మాడిన గిన్నె తిరిగి మునుపటి మెరుపును పొందుతుందంటున్నారు.
మరకలు మాయం!
దుస్తులు, కార్పెట్స్‌పై పడిన టమాటా కెచప్ వంటి మరకలను వదిలించడానికి ఆలుగడ్డ చక్కగా పనిచేస్తుందంటున్నారు. దీనికోసం ఒక చిన్న ఆలూ ముక్క తీసుకొని మరక పడిన చోట రుద్దండి. ఆ తర్వాత బంగాళాదుంపలు ఉడికించిన వాటర్‌ని దానిపై పోయాలి. అనంతరం ఆ క్లాత్‌ను ఓ 30 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఆపై నార్మల్‌గా సబ్బుతో వాష్ చేస్తే మరక తొలగిపోవడం గమనించవచ్చంటున్నారు. లేదంటే బంగాళాదుంపలు ఉడికించిన వాటర్‌లో స్పాంజిని ముంచి మరక పడిన చోట రుద్దినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
వెండి ఆభరణాలను మెరిపించవచ్చు!
గాలి తగలడం వల్ల వెండి ఆభరణాలు నల్లగా మారడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో వెండి వస్తువుల్ని బంగాళాదుంపలు మరిగించిన నీళ్లతో శుభ్రం చేయడం ద్వారా బెటర్ రిజల్ట్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఆ వాటర్‌లో ఉండే స్టార్చ్ నల్లగా మారిన వెండి ఆభరణాలు/వస్తువుల్ని తిరిగి మెరిపించడంలో సహాయపడుతుందంటున్నారు. అయితే, వాటర్ మరీ వేడిగా, బాగా చల్లగా ఉండకుండా చూసుకోవాలి. ఈ నీటిలో నల్లగా మారిన వెండి వస్తువుల్ని వేసి గంటపాటు ఉంచాలి. అనంతరం బ్రష్‌తో శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు.
ఫర్నిచర్ క్లీనింగ్ కోసం : చెక్క వస్తువులు లేదా ఉడెన్ ఫర్నిచర్‌ని శుభ్రం చేయడానికి కూడా ఆలూని ఉపయోగించవచ్చంటున్నారు. ఇందుకోసం ఒక చిన్న బౌల్లో కొద్దిగా వెనిగర్, టీస్పూన్ ఉప్పు, తురిమిన ఆలూ కొద్దిగా వేసుకొని అన్ని కలిసేలా బాగా కలిపాలి. ఆపై ఈ మిశ్రమంలో స్పాంజిని ముంచి చెక్క ఫర్నిచర్‌ని తుడిచేస్తే సరి. దానిపై ఉన్న మరకలు తొలగిపోయి కొత్తవాటిలా మెరిసిపోతాయంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
ఉల్లిపాయలు ఇలా కట్ చేయండి.. గిన్నెలు అలా కడగండి - ఈ సూపర్ టిప్స్ తెలుసా?
మిక్సీ అడుగు భాగం నల్లగా మారిందా? - ఈ టిప్స్ పాటిస్తే క్షణాల్లో కొత్తదానిలా!