Tirumala Special Darshan Tickets for May 2025 : తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలవాడి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సాధారణ సమయంలోనే తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సమ్మర్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో అధిక సంఖ్యలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు.
మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మే నెల కోటా ప్రత్యేక దర్శనం, ఇతర సేవల టికెట్లకు సంబంధించి ఆన్లైన్ టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది టీటీడీ. మరి, మే నెలకు సంబంధించి ఏయే తేదీల్లో ఏ ఏ టికెట్లను విడుదల చేస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మే నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఈనెల(ఫిబ్రవరి) 21వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేస్తారు.
అంగప్రదక్షిణం టోకెన్లు : ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం పది గంటలకు మే నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణిట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
తిరుమల 'పాండవ తీర్థం'- ఒక్కసారి స్నానం చేస్తే చాలు- అన్నింటా విజయం తథ్యం!
ప్రత్యేక దర్శనం టికెట్లు : 24వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన రూ.300 టికెట్ల కోటా(ప్రత్యేక దర్శనం టికెట్లు) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల ఉంటుందని పేర్కొంది.
శ్రీవారి సేవ కోటా : అదేవిధంగా, శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న మార్నింగ్ 11 గంటలకు, నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టోకెన్లు ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఆ టికెట్లు విడుదల :
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి మే నెల కోటా టికెట్లను ఈ నెల 18(మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటి లక్కీడిప్ కోటా కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు.
మే నెలలో తిరుమల వెళ్లే భక్తులు శ్రీవారి ఆర్జితసేవలు, స్పెషల్ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలని టీటీడీ సూచించింది.
అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళుతున్నారా? - టీటీడీ కీలక సూచన ఇవే!