Hyderabad to Ayodhya Flight Cost: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో అనేక దశబ్దాల తర్వాత భవ్య రామ మందిరం పూర్తి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. కేవలం భారత్ నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల కోరిక మేరకు హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఫలితంగా కేవలం రెండు గంటల్లోనే అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 27న హైదరాబాద్- అయోధ్య సర్వీస్ ప్రారంభం కాగా.. వారంలో నాలుగు రోజుల పాటు విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ విమానం రాకపోకలు సాగించనుంది. మధ్యాహ్నం 01:55 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరగా.. 04:05 గంటలకు అయోధ్య చేరుకోనుంది. మళ్లీ తిరిగి సాయంత్రం 04:40 గంటలకు అయోధ్యలో బయలుదేరగా.. 06:40కు చేరుకోనుంది. కాగా.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే విమాన ధర సుమారు రూ. 5 వేలపైన ఉంది.
అయోధ్యతో పాటు ఆగ్రా, కాన్పూర్, ప్రయాగరాజ్, రాజ్‌కోట్, ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి అగర్తాల, జమ్మూకు విమాన సర్వీసులు కొనసాగుతుండగా.. మరికొన్ని కొత్త సర్వీసులను కూడా మొదలుపెట్టింది. హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు ప్రతిరోజు సర్వీసు నడుస్తుండగా.. ప్రయాగరాజ్, ఆగ్రాకు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాలకు వారానికి 4 రోజుల పాటు సేవలందించే విమాన సర్వీసులను విమానయాన శాఖ ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ విమాన సర్వీసులను వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్‌కు రూ. 5,635 పైన ఉండగా.. హైదరాబాద్ నుంచి కాన్పూర్ వెళ్లేందుకు టికెట్ ధర రూ. 4,598పైన ఉంది.