Young Man from Nalgonda Grabs Four Govt Jobs : అనుభవమే అన్నీ నేర్పిస్తోందన్న నమ్మకం ఆ యువకుడిది. ఒకసారే పోటీ పరీక్షలు రాసి ఆగిపోకుండా మళ్లీ ప్రయత్నించే ఆలోచన అతనిది. గత ఎస్సై పోటీ పరీక్షలో ఒక్క మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోయినా అధైర్యపడలేదు. అదే అతనిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా కసిని పెంచి బాగా కష్టపడి చదివేలా చేసింది. ఫలితంగా వరుసగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు నల్గొండకు చెందిన మెండె ప్రణబ్ ఏనోశ్.
నల్గొండ పురపాలిక పరిధిలోని కేశరాజుపల్లి ప్రాంతానికి చెందిన ప్రణబ్ ఏనోశ్ (31) బీటెక్ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు మెండె లచ్చయ్య, సునీత. తల్లి అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ల ప్రకటన జారీ చేసింది. ఇందులో మెండె ప్రణబ్ ఏనోశ్కు ఒక్క మార్కు తేడాతో ఎస్సై ఉద్యోగం అందినట్లే అంది చేజారింది. దీంతో ఇంకా బాగా చదివితే ఉద్యోగం సాధించేవాన్ని అనే భావన తనలో కలిగింది.
గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించాలన్నదే తన లక్ష్యమంటున్న యువకుడు : అనుభవాన్ని ఉపయోగించుకుంటే విజయం సాధ్యమవుతుందని మెండె ప్రణబ్ ఏనోశ్ అంటున్నారు. కొంతమంది ఒక్కసారే పోటీ పరీక్షలు రాసి రాకపోయేసరికి ఆగిపోతున్నారని, అలా కాకుండా ఆ అనుభవాన్ని వినియోగించుకుని సన్నద్ధమైతే విజయం సాధిస్తారని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించాలన్నదే ప్రస్తుతం తనకు ముందున్న లక్ష్యమని, దానిని సాధిస్తానన్న నమ్మకం కలిగిందని పేర్కొన్నారు.
మెండె ప్రణబ్ ఏనోశ్ పోటీ పరీక్షలకు ఎక్కడా శిక్షణ తీసుకోకుండా ఆన్లైన్లో తరగతులు, మెటీరియల్‌తోనే వింటూ తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేశాడు. ఇలా సన్నద్ధమవుతూ 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం, 2020లో అగ్నిమాపకశాఖలో ఫైర్‌మెన్‌గా ఉద్యోగం సాధించాడు. చౌటుప్పల్‌లో అగ్నిమాపకశాఖలో ఉద్యోగంలో చేరాడు. అంతటితో సంపతృప్తి చెందకుండా అవకాశం వచ్చినప్పుడల్లా పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతూ నోట్స్ తయారు చేసుకునేవాడు. 2024లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాడు. తాజాగా ఇటీవల టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్ 4 పరీక్షలో రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.
ఔరా..! ఊరు చూస్తే చిన్నది - ఊరి నిండా ప్రభుత్వ ఉద్యోగులే!
కోచింగ్ లేకుండానే ఏడు ఉద్యోగాలు - ఈ మాస్టారు 'లెక్కే' వేరు