How to Stop An Itchy Scalp in Winter :చలికాలంలో చర్మం పొడిబారడం, పాదాల పగుళ్లు వంటి సమస్యలు చాలా మందిని వెంటాడుతుంటాయి. అలాగే మరికొంత మందిలో జుట్టు కుదుళ్లలోని చర్మం పొడిబారిపోవడం వల్ల చుండ్రు, పేలు.. వంటి సమస్యలొస్తాయి. ఫలితంగా తలలో ఎక్కువ దురద పుడుతుంది. ఈ సమస్య తీవ్రమైతే జుట్టు దృఢత్వాన్ని కోల్పోయి అధికంగా రాలిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో మీరు చూసేయండి..
వారానికి ఒకసారి తప్పకుండా :కొంతమంది తలకు నూనె రాసుకోవడం వల్ల జిడ్డుగా ఉంటుందని ఆయిల్‌కి దూరంగా ఉంటుంటారు. ఇలా ఎక్కువ రోజులు నూనె రాసుకోకపోవడం వల్ల.. శీతాకాలంలో కుదుళ్లలోని చర్మం పొడిబారిపోతుందని.. దీనివల్ల చుండ్రు రాలడంతోపాటు, పేలు సమస్య కూడా వేధిస్తుందంటున్నారు. అలాగే జుట్టు కూడా నిర్జీవంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి ఆయిల్ని కనీసం వారానికోసారైనా తలకు పట్టించాలని.. దీనివల్ల దురద తగ్గడంతో పాటు.. జుట్టు కూడా పట్టులా మెరుస్తుందని సలహా ఇస్తున్నారు.
మసాజ్ చేయాలి :సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల కూడా కుదుళ్ల ఆరోగ్యం పాడవుతుందట. కాబట్టి ఆయిల్ రాసుకునే ముందు దాన్ని కాస్త గోరువెచ్చగా చేసుకుని.. దాంతో కుదుళ్లపై కాసేపు మర్దన చేయాలి. ఫలితంగా కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి దురద క్రమంగా తగ్గిపోతుందని అంటున్నారు. అయితే ఆయిల్ రాసిన తర్వాత జిడ్డుగా ఉందనిపిస్తే.. కొద్దిసేపటికి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా మారుతుందని సూచిస్తున్నారు.
తడిగా ఉన్నప్పుడు వద్దు :ఎక్కువమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే గట్టిగా జడ వేసుకోవడం లేకపోతే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. దీంతో జుట్టుకుదుళ్లు పూర్తిగా ఆరవు. అలాగే ఆ ప్రదేశంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా తలలో దురద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరేదాకా అలా వదిలేయాలి.. లేకపోతే వదులుగా ఫ్లక్కర్ పెట్టుకొని వదిలేయడం మంచిది.