How To Remove Skin Tags :స్కిన్ టాగ్స్.. వీటినే "పులిపిర్లు" అంటారు. గతంలో పులిపిర్లు ఎవరికో ఒకరికి కనిపించేవి. కానీ.. ఇప్పుడు చాలా మందిలో ఇవి కనిపిస్తున్నాయి. ముఖం, మెడ, చంకల భాగాల్లో మొలుస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. అయితే.. భవిష్యత్తులో ఇవి క్యాన్సర్ కణతులుగా మారే అవకాశం ఉందని చాలా మంది భయపడుతుంటారు. మరి.. నిజంగానే పులిపిర్లు క్యాన్సర్ కణతులుగా మారతాయా? ఇవి ఎలా తగ్గుతాయి? అనే ప్రశ్నలకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ 'డాక్టర్ స్వప్న ప్రియ' సమాధానం చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం..
స్కిన్ టాగ్స్ క్యాన్సర్ (Healthdirect రిపోర్టు) మాదిరిగా ఎప్పటికీ మారవని స్వప్న చెబుతున్నారు. చర్మంపైపులిపిర్లు ఉన్నవారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే.. శరీరంపై ఒకటి రెండు పులిపిర్లు పెద్దగా మారొచ్చని, అలాగే కొత్తవి కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ.. ఇవి క్యాన్సర్ కణతులుగా మారే అవకాశం లేదని డాక్టర్ స్వప్న ప్రియ అంటున్నారు.
పులిపిర్లు రావడానికి కారణాలు ?
- వంశపారంపర్యంగా పులిపిర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా పులిపిర్లు ఉంటే.. అది మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ప్రస్తుత కాలంలో ఊబకాయంతో ఎక్కువమంది బాధపడుతున్నారు. వీరిలో కూడా పులిపిర్లు ఎక్కువగా వస్తాయి.
- అలాగే షుగర్ ఉన్నవారు క్రమంగా బరువు పెరుగుతున్నా కొద్దీ.. స్కిన్టాగ్స్ కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారిలో పులిపిర్లు ఏర్పడతాయి.
ఇంటి చిట్కాలు పాటిస్తే పులిపిర్లు తగ్గుతాయా ?
కొంత మంది పులిపిర్లు తగ్గడానికి వివిధ రకాల క్రీమ్స్, ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, ఇవేవీ శాశ్వతంగా పూర్తిగా పులిపిర్లను మాయం చేయలేవు. అయితే, కొంతమంది ఇవి తొడలపై, మెడ భాగంలో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా తొడల భాగంలో పులిపిర్లు ఉన్నప్పుడు నడిచేటప్పుడు చర్మం రాపిడికి గురవుతుంది. ఇలాంటి సందర్భంలో పులిపిర్లను తొలగించాల్సి ఉంటుందని డాక్టర్ స్వప్న ప్రియ అంటున్నారు.