How to Make Rice Flour Jantikalu: దసరా పండగ వచ్చేస్తోంది. పిండి వంటకాలను చేయడానికి అందరూ సిద్ధమైపోతుంటారు. ఈ సమయంలో చేసుకునే పిండి వంటకాల్లో ప్రధానమైనవి.. జంతికలు. వీటినే 'మురుకులు' అని కూడా పిలుస్తుంటారు. కేవలం పండగలే కాకుండా, శుభకార్యాల సమయంలో, ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, కొందరు మురుకులను బియ్యప్పిండితో తయారు చేసుకున్నప్పుడు.. మెత్తగా, గట్టిగా వస్తున్నాయని బాధపడుతుంటారు. అలాంటివారు ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే జంతికలు గుల్లగా, కరకరలాడేలా వస్తాయి! మరి, ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూపర్ టేస్టీ బియ్యప్పిండి జంతికలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- పావు కప్పు పచ్చి శనగపప్పు
- పావు కప్పు మినపపప్పు
- పావు కప్పు పెసరపప్పు
- నాలుగు కప్పుల బియ్యం పిండి
- ఒక టేబుల్ స్పూన్ వాము
- 3 టేబుల్ స్పూన్ల నువ్వులు
- రుచికి సరిపడా కారం
- రుచికి సరిపడా ఉప్పు
- పావు కప్పు వెన్న
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వేసుకుని వేయించుకోవాలి. (మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ అన్నీ బాగా వేగేలా చూసుకోవాలి.)
- ఆ తర్వాత వీటిని చల్లారబెట్టుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (జల్లెడలో వేసుకుని జల్లించుకుని.. మిగతాది మరోసారి మిక్సీ పట్టుకోవాలి)
- ఇప్పుడు మెత్తగా పట్టుకున్న పప్పు పిండి, జల్లించుకున్న బియ్యం పిండి, వాము, నువ్వులు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి.
- అనంతరం ఇందులో వెన్న లేదా వేడి నూనె కొద్దిగా పోసుకుని బాగా కలపాలి. (ఇప్పుడు రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు కలుపుకోవచ్చు)
- ఇప్పుడు గోరు వెచ్చటి నీటిని తీసుకుని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని కలపాలి. (మరీ మెత్తగా, గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్‌గా ఉండేలా కలిపితే సరిపోతుంది)
- మరోవైపు స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో నూనె పోసి బాగా వేడి చేసుకోవాలి.
- నూనె బాగా వేడయ్యాక జంతికల గొట్టంలో పిండిని పెట్టుకొని నూనెలోకి ప్రెస్ చేసుకోవాలి. (మురుకుల గొట్టంలో పెట్టే ప్రతీసారి పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి)
- పచ్చిదనం పోయేంత వరకు కాలనిచ్చి.. ఆ తర్వాత రెండో వైపునకు తిప్పుకుని కాల్చుకోవాలి. (మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. నూనె బాగా కాగితేనే జంతిక లోపల గుల్లగా వస్తాయి)
- రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసుకుని గిన్నె తీసుకుంటే కరకరలాడే జంతికలు రెడీ! వీటిని డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.
చెట్టినాడ్ టమాటా చట్నీ - టిఫెన్, అన్నంలోకి సూపర్ కాంబో - ఈజీగా ప్రిపేర్ చేయండిలా! - Chettinad Tomato Chutney
రెండు సంవత్సరాలైనా పాడవని ఊర మిరపకాయలు - ఒక్కరోజులోనే ఈ స్పైసీ సైడ్ డిష్ రెడీ! - How to Make Challa Mirapakayalu