Letha Chintakaya Pachadi in Telugu: ప్రతీ సీజన్లో కొన్ని రకాల పండ్లు, కాయగూరలు వస్తుంటాయి. ఇప్పుడు లేత చింతకాయలు దొరికే సీజన్ కాబట్టి తప్పకుండా దీనిని ట్రై చేయండి. కొన్ని ప్రాంతాల్లో వాన చింతకాయలుఅని కూడా పిలుస్తారు. వీటితో తయారు చేసే రోటి పచ్చడి పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనిని ఒక్కసారి చేసుకున్నారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుంటారు. ఈ చట్నీ ఫ్రిజ్‌లో పెడితే కనీసం 15 రోజుల నుంచి నెల వరకు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 350 గ్రాముల లేత చింతకాయలు
- 4 టేబుల్ స్పూన్ల నూనె
- 2 టేబుల్ స్పూన్ల పల్లీలు (వేరుశనగ)
- 18 పచ్చి మిరపకాయలు
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు
తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు
- 3 టేబుల్ స్పూన్ల నూనె
- 2 ఎండు మిరపకాయలు
- ఒక టీ స్పూన్ ఆవాలు
- అర టీ స్పూన్ శనగపప్పు
- ఒక టీ స్పూన్ మినపప్పు
- 10 వెల్లుల్లి రెబ్బలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- 2 చిటికెల ఇంగువా
- పావు చెంచా పసుపు
తయారీ విధానం
- ముందుగా లేత చింతకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి వాటి కొనలను తుంచివేయాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి పాన్‌లో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇందులో పల్లీలు వేసి వేయించుకోవాలి.
- అనంతరం పచ్చిమిరపకాయలు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కాసేపు మగ్గనివ్వాలి.
- ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న చింతకాయలను వేసుకుని సుమారు 8 నిమిషాల పాటు మగ్గించుకుని దించేసుకోవాలి.
- ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి ఉప్పు, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి.
తాళింపు విధానం
- స్టౌ ఆన్ చేసుకుని ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇందులో ఎండు మిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- ఇవి వేగుతున్న సమయంలోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఇంగువా వేసి కలపాలి.
- ఆ తర్వాత దించేసేముందు పసుపు వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ తాళింపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి కలిపితే టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ!
చింత పండుతో చేసే పచ్చిపులుసు అందరికీ తెలుసు - పల్లీలతో చేస్తారని మీకు తెలుసా? - తిని తీరాల్సిందే గురూ! - Palli Pachi Pulusu Recipe
దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్‌దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీగా చేసుకోండిలా!