How to Make Kajjikayalu at Home: దసరా, దీపావళి లాంటి పెద్ద పండగలు వస్తున్నాయంటే కచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు చేస్తుంటారు. అందులో హాట్, స్పైసీ ఫుడ్స్‌తోపాటు స్వీట్స్ కూడా చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలను తప్పనిసరిగా చేస్తారు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. చాలా మంది కజ్జికాయలు రుచికరంగా రాలేదని అనుకుంటుంటారు. మరి, ఎలా చేస్తే రుచికరమైన కజ్జికాయలను వస్తాయి? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ
- 2 కప్పుల మైదా పిండి
- ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి
- రుచికి సరిపడా ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె
- అర కప్పు నువ్వులు
- అర కప్పు పల్లీలు
- అర కప్పు శనగపప్పు
- 5 యాలకలు
- ఒక కప్పు బెల్లం
- అర కప్పు తురిమిన ఎండు కొబ్బరి
- పావు కప్పు పంచదార
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
తయారీ విధానం..
- ముందుగా ఓ గిన్నెలో బొంబాయి రవ్వను తీసుకుని అందులో పావు కప్పు నీళ్లు పోసి సుమారు 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో గిన్నెలో జల్లించుకున్న మైదా పిండి, బియ్యం పిండి, ముందుగా నానబెట్టుకున్న రవ్వ, ఉప్పు, నెయ్యి వేసుకుని బాగా కలపాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలిపి సుమారు 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. (పిండిని గట్టిగా కలిపితేనే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి)
- ఈ సమయంలోనే కజ్జికాయల లోపల పెట్టే మిశ్రమం కోసం స్టౌ ఆన్ చేసి పాన్‌లో నువ్వులు, పల్లీలు ఒకదాని తర్వాత ఒకటి వేసి కాసేపు వేయించుకుని చల్లారబెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో చల్లారబెట్టుకున్న నువ్వులు, శనగపప్పు, యాలకలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పల్లీలు వేసుకుని కొద్దిగా పలుకులు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో తరిగిన బెల్లం వేసి బాగా కలిపి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ పొడిని మరో గిన్నెలోకి తీసుకుని తురిమిన ఎండు కొబ్బరి, పంచదార, నెయ్యి వేసుకుని బాగా కలపాలి. (అవసరమైతే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ను వేసుకోవచ్చు)
- ఆ తర్వాత నానబెట్టుకున్న పిండిని తీసుకుని మరోసారి 2 నిమిషాలు కలపాలి.
- కొద్దిగా పిండిని తీసుకుని రొట్టెలాగా చేసుకుని మధ్యలో మిశ్రమం పెట్టుకుని నీటిని తడిపి అంచులు మూసివేయాలి.(మీ వద్ద కజ్జికాయ చెక్క ఉంటే ఈజీగా చేసుకోవచ్చు.
- స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో కజ్జికాయలను ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె కాగిన తర్వాత కజ్జికాయలు వేసుకుని లో-ఫ్లేమ్‌లోనే కాసేపు వేయించుకుని పచ్చిదనం తగ్గాక మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి రెండో వైపునకు తిప్పుకోవాలి.
- ఇలా రెండు వైపులా కాస్త ఎర్రగా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేస్తే టేస్టీగా, క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ!
దసరా స్పెషల్ : జంతికలు చేస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే సూపర్ టేస్టీగా కరకరలాడిపోతాయ్! - How to Make Rice Flour Jantikalu
అమ్మవారికి ఎంతో ఇష్టమైన "పులిహోర పులుసు" - ఇలా చేసి నైవేద్యం సమర్పించండి! - Instant Pulihora Paste