How to Make Usirikaya Pappu Recipe : ఉసిరికాయల సీజన్ మొదలైపోయింది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. ఈ ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఉసిరికాయలతో చాలా మంది నిల్వ పచ్చడి పెడుతుంటారు. అలాగే రసం కూడా చేసుకుంటుంటారు. కానీ.. ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు వండుకోవచ్చని మీకు తెలుసా? వేడివేడి అన్నంలో నెయ్యి, ఉసిరికాయ పప్పు కాంబినేషన్ వేరే లెవల్ అన్నట్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఉసిరికాయ పప్పు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై మీరు ఓ లుక్కేయండి..!
కావాల్సిన పదార్థాలు..
- ఉసిరికాయలు-6
- కందిపప్పు- కప్పు
- పచ్చిమిర్చి-6
- ఉల్లిపాయ-1
- టమాటాలు-2
- 3 కప్పుల నీరు
- నూనె-3 టేబుల్‌స్పూన్లు
- మెంతులు- అరటీస్పూన్
- ఆవాలు-టీస్పూన్
- పచ్చిశనగపప్పు-టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి-2
- కరివేపాకు -2
- వెల్లుల్లి-8
- చిటికెడు ఇంగువ
తయారీ విధానం..
- ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు అరగంటపాటు నానబెట్టుకోండి.
- అలాగే ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టి అందులో ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ పోయండి. ఉసిరికాయలు మెత్తగా ఉడికించుకోండి.
- ఉడికిన ఉసిరికాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. వాటిలోని గింజలను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి.
- తర్వాత మిక్సీ గిన్నెలో కొన్ని పచ్చిమిర్చి, ఉసిరికాయ ముక్కలు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, 3 కప్పుల నీరు పోసి పప్పు మెత్తగా ఉడికించుకోండి.
- మరొక గిన్నెలో పప్పు రెడీ చేయడం కోసం.. ఆయిల్ పోసుకోండి. ఇందులో మెంతులు వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేపుకోండి.
- తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి.
- వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేపుకోండి. ఉల్లిపాయలు మెత్తగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని కలుపుకోండి.
- టమాటాలు ఉడికిన తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకుని మిక్స్ చేయండి.
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత గ్రైండ్ చేసిన ఉసిరికాయ పేస్ట్ వేయండి. అలాగే ఉసిరికాయలు ఉడికించుకున్న వాటర్ యాడ్ చేయండి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర చల్లి.. స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పప్పు మీ ముందుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ఈ విధంగా ఒక్కసారి ఉసిరికాయ పప్పు చేయండి. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.