Hyderabad Special Dum Keema Recipe : నాన్‌వెజ్‌లో ఎక్కువ మంది మటన్ ఇష్టంగా తింటారు. కాస్త మసాలాలు ఎక్కువగా వేసి బగారా రైస్‌తో మటన్ కర్రీ తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే, కొంతమంది మటన్ కీమా ఇష్టంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా "హైదరాబాద్ స్టైల్ మటన్ దమ్ కీమా" రెసిపీ ట్రై చేయండి. ఈ కీమా వేడివేడి బగారా రైస్, చపాతీల్లోకి రుచి ఎంతో బాగుంటుంది. మరి ఈ మటన్ కీమా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- మటన్ కీమా - అరకేజీ
- ఉల్లిపాయ ముక్కలు- కప్పు
- ఉప్పు- తగినంత
- కారం - తగినంత
- పెరుగు- 100 గ్రాములు
- కొత్తిమీర, పుదీనా తరుగు-కొద్దిగా
- చిరోంజి గింజలు-ఒకటిన్నర టీస్పూన్లు
- మిరియాల పొడి-అర టేబుల్‌స్పూన్
- కారం -అర టేబుల్‌స్పూన్
- వేపిన జీలకర్ర పొడి -టీస్పూన్
- పసుపు- అరటీస్పూన్
- గరం మసాలా -టీస్పూన్
- నాగకేసరల పొడి (తోక మిరియాలు లేదా కబాబ్ చీనీ)- అరటీస్పూన్
- ధనియాల పొడి-టీస్పూన్
- శనగపిండి-టేబుల్‌స్పూన్
తయారీ విధానం:
- ముందుగా రెసిపీ కోసం పచ్చిమిర్చి సన్నగా తురుముకోండి. అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకోండి.
- అలాగే చిరోంజి గింజలను 2 గంటలు నానబెట్టి మెత్తని పేస్ట్‌లా మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకోండి. (చిరోంజి గింజలకు బదులుగా మీరు బాదం నానబెట్టి.. ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు)
- ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్ కీమా ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇందులో కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి తరుగు, చిరోంజి పేస్ట్, మిరియాల పొడి, కారం, వేపిన జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, నాగకేసరల పొడి, ధనియాల పొడి వేసి కలపండి.
- ఆపై పెరుగు వేసి మిక్స్ చేయండి. కీమాకి మసాలాలు బాగా పట్టిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్స్పూన్ల నూనె వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని గంటలపాటు ఫ్రిడ్జ్‌లో పెట్టండి.
- ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేపండి.
- ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి.
- ఇప్పుడు శనగపిండి వేసి కలపండి. అనంతరం ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్న మటన్ కీమా మిశ్రమం వేసి కలపండి.
- ఒక ఐదు నిమిషాలు మూత తీసి ఉడికిస్తే కీమాలో నీరు పైకి తేలుతుంది.
- అప్పుడు మూత పెట్టి స్టౌ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేయండి. మధ్యమధ్యలో కలుపుతూ కీమాలో ఆయిల్ పైకి తేలె వరకు ఉడికించుకోండి.
- ఇప్పుడు కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలపండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్‌గా చేసుకుంటే సూపర్ టేస్టీ దమ్ కీమా మీ ముందుంటుంది.
- నచ్చితే ఇలా కీమా రెసిపీ ఓ సారి ట్రై చేయండి.