Maggi Omelette Recipe :మ్యాగీ అంటే పిల్లలకు ఎంత ఇష్టమో చెప్పాల్సిన పని లేదు. వేడివేడిగా ప్లేట్లో ఇలా వేసి ఇవ్వగానే అలా తినేస్తారు. అయితే.. మిగతా స్నాక్ రెసిపీల కన్నా మ్యాగీ చేయడం చాలా సులభం కావడంతో.. మమ్మీలు కూడా తరచూ దీనిని చేస్తుంటారు. అయితే.. మ్యాగీ ఎప్పుడూ ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది. అందుకే.. మీ కోసం కాస్త వెరైటీగా"మ్యాగీ ఆమ్లెట్" రెసిపీని పరిచయం చేయబోతున్నాం.
ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఎక్కువ టైమ్ లేనప్పుడు మ్యాగీతో ఇలా ఆమ్లెట్ వేసేయండి. ఈ ఆమ్లెట్‌ని పిల్లలే కాదండీ.. పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. దీనిని చేయడానికి కూడా ఎక్కువ టైమ్ పట్టదు. కేవలం పది నిమిషాల్లోనే తయారైపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా రుచికరమైన మ్యాగీ ఆమ్లెట్ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- మ్యాగీ-1 ప్యాకెట్
- ఎగ్స్-3
- సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు -3 టేబుల్‌స్పూన్లు
- క్యాప్సికమ్ తరుగు-2 టేబుల్‌స్పూన్లు
- క్యారెట్ తురుము-2 టేబుల్‌స్పూన్లు
- సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2
- అల్లం ముక్కలు-టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు కొద్దిగా
- నూనె -2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం :
- ముందుగా స్టౌ ఆన్ చేసి మ్యాగీ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కప్పు నీటిని పోసుకుని మ్యాగీ వేసుకోవాలి.
- ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మ్యాగీ ఉడికిన తర్వాత మసాలా మిశ్రమం వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఎగ్స్ పగలగొట్టి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ తరుగు, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి, ఇందులో నూనె వేసి వేడి చేయండి.
- ఆపై ఆమ్లెట్ మిశ్రమం పోసుకుని పాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఆమ్లెట్ మిశ్రమం కొద్దిగా కుక్ అయిన తర్వాత.. మధ్యలో ఉడికించుకున్న మ్యాగీ వేసుకోండి.
- ఇప్పుడు మ్యాగీని మధ్యలో ఉంచి.. ఆమ్లెట్ ఫోల్డ్ చేసుకోండి. రెండు వైపులా ఆమ్లెట్ కాస్త దోరగా ఫ్రై చేసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ ఎగ్ ఆమ్లెట్ మీ ముందుంటుంది. నచ్చితే ఓ సారి ఇలా ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
ఇవి కూడా చదవండి:
ఇడ్లీలు మిగిలిపోతే ఇలా "బజ్జీలు" చేసుకోండి - సూపర్ టేస్టీగా ఉంటాయి గురూ!
క్రిస్పీ అండ్ టేస్టీ "ఆనియన్ బోండా" - ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే వేడివేడిగా తినొచ్చు!