తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

తెలంగాణ స్టైల్​ "రేగుపండ్ల నిల్వ పచ్చడి" - ఒక్కసారైనా రుచి చూడాల్సిందే! - ఏడాది నిల్వ! - HOW TO MAKE REGIPANDU NILVA PACHADI

-పుల్లగా కారంగా అదుర్స్​ అనిపించే రేగుపండు పచ్చడి - ఇలా చేస్తే సూపర్​ టేస్ట్​తో పాటు నిల్వ కూడా!

How to Make Regipandu Nilva Pachadi
How to Make Regipandu Nilva Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 4:46 PM IST

How to Make Regipandu Nilva Pachadi :తీపీ పులుపూ వగరూ కలగలిసిన రుచితో ఉండే రేగుపండ్లు అంటే అందరికీ ఇష్టమే. అందుకే చాలా మంది వీటిని ఎక్కువ మొత్తంలో కొంటుంటారు. ఈ రేగుపండులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే రేగుపండ్లను మామూలుగా తినడం అందరికీ తెలిసిందే. కానీ వీటితో నిల్వ పచ్చడి చేస్తారని చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. అవును, రేగుపండ్లతో అద్దిరిపోయే నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ పచ్చడిని పక్కా కొలతలతో చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్​గా ఉంటుంది. మరి లేట్​ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

రేగుపండ్లు - పావు కేజీ

పండు మిర్చి - 100 గ్రాములు

ఆవ పిండి - 2 టీ స్పూన్లు

మెంతి పిండి - 1 టీ స్పూన్​

వేరుశనగ నూనె - 150 గ్రాములు

ఆవాలు - 3 టీ స్పూన్లు

మెంతులు - 1 టీ స్పూన్​

వెల్లుల్లి రెబ్బలు - 20

ఉప్పు - 50 గ్రాములు

కారం - 2 టీస్పూన్లు

తయారీ విధానం:

  • ముందుగా రేగుపండ్లను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఫ్యాన్​ గాలికి ఆరబెట్టుకుని నీళ్ల తడి లేకుండా ఓ పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని వాటి తొడిమలు తీసి పక్కన పెట్టాలి.
  • పండుమిర్చిని కూడా శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి తొడిమలు తీయాలి. ఆ తర్వాత వాటిని మిక్సీజార్​లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • ఈ పచ్చడి కోసం ఆవపిండి, మెంతిపిండి కూడా అప్పటికప్పుడే ప్రిపేర్​ చేసుకోవాలి. నిల్వ ఉన్న పొడులైతే రుచి అంత బాగుండదు. కాబట్టి ఆవాలు, మెంతులు విడివిడిగా వేయించుకుని విడిగా మిక్సీ పట్టి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు, మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • అవి వేగిన తర్వాత పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి అవి మగ్గే వరకు వేయించుకోవాలి.
  • ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా వేగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి.
  • నూనె చల్లారిన తర్వాత ఆవపిండి, మెంతి పిండి వేసుకుని కలపాలి. ఆ తర్వాత ఉప్పు వేసి మరోసారి కలపాలి.
  • ఇప్పుడు గ్రైండ్​ చేసుకున్న పండు మిర్చి మిశ్రమాన్ని వేసి నూనెలో బాగా కలిసేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తొడిమ తీసి శుభ్రం చేసుకున్న రేగుపండ్లు వేసుకోవాలి. వీటిని నిధానంగా నూనె మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి.
  • అనంతరం ఓ గాజు జార్​ తీసుకుని అందులోకి ఈ రేగుపండు మిశ్రమాన్ని వేసి మూత పెట్టి ఓ మూడు రోజుల పాటు అలానే వదిలేయాలి.
  • మూడు రోజుల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఈ సమయంలో ఉప్పు చూసుకుని, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి.
  • నూనె సరిపోకపోయినా సరే కాగబెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత పోసుకోవాలి.
  • అంతే ఎంతో రుచికరంగా ఉండే రేగుపండ్ల నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది.
  • నచ్చితే మీరూ ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు.

"కొత్తిమీర నిల్వ పచ్చడి" - ఇలా చేస్తే వారెవ్వా! - కనీసం 6 నెలలు నిల్వ!

నోరూరించే ఆంధ్రా స్టైల్ "గోంగూర నిల్వ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే ఏడాది పాటు ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details