Onion Paratha Recipe in Telugu:వంటకు ఎక్కువ సమయం లేనప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా పరోటాలను చేసుకుంటుంటారు కొందరు. అయితే, పరోటా అనగానే చాలా మందికి ఆలు పరోటానే గుర్తుకు వస్తోంది. కానీ, ఉల్లిపాయ స్టఫింగ్తో చేసే ఈ పరోటా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ ఇలా దేంట్లోకైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించేఉల్లి పరోటా ఎలా చేసుకోవాలి? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి
- 2 టీ స్పూన్ల నెయ్యి/ నూనె
- రుచికి సరిపడా ఉప్పు
- రెండు ఉల్లిపాయలు
- 2 పచ్చి మిరపకాయలు
- ఒక ఇంచు అల్లం ముక్క
- అర టీ స్పూన్ వాము
- అర టీ స్పూన్ కారం
- 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర
- అర టీ స్పూన్ ధనియాల పొడి
- అర టీ స్పూన్ గరం మసాలా
- 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు
- నూనె
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని బాగా కలపాలి.
- ఆ తర్వాత ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలిపి కొద్దిగా నూనె అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు చిన్న రోటీలో పచ్చి మిరపకాయలు, అల్లం ముక్కను తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- మరోవైపు మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. (ఇది లేకపోతే శనగపిండిని కాస్త వేయించుకుని వేసుకోవచ్చు)
- ఆ తర్వాత ఓ గిన్నెలో దుంచుకున్న పచ్చి మిర్చి-అల్లం మిశ్రమం, ఉల్లిపాయను ముక్కలు, వాము, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, పుట్నాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలిపి చిన్న ముద్దను తీసుకుని పొడి పిండిలో ముంచి తీసుకోవాలి.
- ఆ పిండి ముద్దను చిన్న పూరీలా రోల్ చేసుకుని అందులో రెడీ చేసి పెట్టుకున్న 3 టీ స్పూన్ల పరోటా స్టఫ్‌ను పెట్టి బయటకు రాకుండా అంచులు మూసివేయాలి.
- ఆ తర్వాత ఇంకొంచెం పొడి పిండిని వేసి రెండు వైపులా తిప్పుకుంటూ పరోటాలా రోల్ చేసుకోవాలి.
- మరోవైపు స్టౌ ఆన్ చేసుకుని పెనం పెట్టి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత పెనంపై పరోటాను వేసి మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా దోరగా కాల్చాలి.
- ఇప్పుడు నెయ్యి లేదా నూనె పోసి రెండు వైపులా బాగా కాలిస్తే వేడి వేడి ఉల్లిపాయ పరోటా రెడీ!
ఎండు మిర్చితో కారం పొడి రొటీన్ - పచ్చి మిర్చితో ప్రిపేర్ చేసి చూడండి! - అద్దిరిపోయే రుచి మీ సొంతం
చేసిన కాసేపటికే చపాతీలు గట్టిపడుతున్నాయా? - ఇలా చేశారంటే ఎన్ని గంటలైనా సూపర్ సాఫ్ట్!