How to Make Millets Pulao Recipe : మిలెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన మిలెట్స్కు మళ్లీ మహర్దశ మొదలైంది. నేటి ఆధునిక జీవనంలో ఆరోగ్య రక్షణకు వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మంది రాగి జావ, కొర్రల అన్నం, రాగి ఇడ్లీవంటివి చేసుకుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా చిరుధాన్యాలతో పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా పులావ్చేస్తే రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైగా ఈ పులావ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
చిరుధాన్యాల పులావ్ కోసం కావాల్సిన పదార్థాలు:
- చిరుధాన్యాలు - కప్పు
- ఉల్లిపాయ - 1
- టమాటా - 1
- పచ్చిమిర్చి - 2
- అల్లం చిన్న ముక్క
- లవంగాలు - రెండు
- వెల్లుల్లి రెబ్బలు - రెండు
- జీలకర్ర - టీస్పూన్
- బిర్యానీ ఆకు - 1
- యాలకులు - రెండు
- దాల్చిన చెక్క ముక్క - 1
- గరం మసాలా - టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఉప్పు రుచికి సరిపడా
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- కప్పు కూరగాయలు (బఠానీ, క్యారెట్, బీన్స్)
తయారీ విధానం:
- చిరుధాన్యాల పులావ్ కోసం మీరు మీకు నచ్చిన మిలెట్స్ (సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు, సామలు, ఊదలు, అరికెలు, అండు కొర్రలు) ఏదైనా ఒక కప్పు తీసుకోండి.
- మిలెట్స్ని శుభ్రంగా కడిగి ఒక అరగంటపాటు నీటిలో నానబెట్టుకోండి.
- ఈ లోపు పులావ్‌లోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బీన్స్, క్యారెట్ వంటివాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ పోయండి. నూనె వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కాసేపు ఫ్రై చేయండి.
- ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా చేసిన అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి.
- ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గించండి.
- టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసి వేపండి.
- ఆపై బఠానీలు, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- గిన్నెపై మూత పెట్టి కూరగాయలు కాసేపు మగ్గించుకోండి. ఆపై వేడివేడి నీరు రెండు గ్లాసులు పోయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
- తర్వాత నానబెట్టుకున్న మిలెట్స్ వేసి కలపండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గిన్నెపై మూత పెట్టి పులావ్ ఉడికించుకోండి.
- పులావ్ రెడీ అయిన తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ చిరుధాన్యాల పులావ్ మీ ముందుంటుంది.
- ఈ పులావ్ నచ్చితే ఓ సారి మీ ఇంట్లో ట్రై చేయండి.
శనగపిండితో పకోడే కాదు, ఇలా కమ్మటి దోశలు కూడా! - పిల్లలు అస్సలు వదలరు!
ఆరోగ్యానికి మేలు చేసే కొర్రలతో "మృదువైన ఇడ్లీలు"- ఈ కొలతలతో సింపుల్‌గా చేసేయండిలా!