Electric Shock Incident in Pedakakani : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో ఉన్న ఓ గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతిచెందారు. సంపులో పూడికను తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాళీ గార్డెన్స్ రోడ్డులో ఓ గోశాల ఉంది. అక్కడి నుంచి విడుదలయ్యే వ్యర్థాలను పక్కనే ఉన్న సంపుల్లోకి పంపిస్తారు. ఆ నీటిని చుట్టుపక్కన ఉన్న పొలాలకు మళ్లించి పంటలు సాగు చేస్తారు.
అయితే వ్యర్థాలు పేరుకుపోవడంతో సంపు మోటర్ నుంచి నీరు రావడం లేదు. దీంతో గోశాల సూపర్వైజర్ మందడి శివరామ కాలిబాబు కొందరు కూలీలను పిలిపించి సంపులో పూడిక తీసే పనులు చేపట్టారు. వారు లోపలికి దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మోటారుకు విద్యుత్ ప్రసారమైంది. ఈ నేపథ్యంలోనే ఓ కూలీకి షాక్ కొట్టింది. అతడిని కాపాడే క్రమంలో మిగతావారు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న పెదకాకాని సీఐ నారాయణస్వామి ఘటనాస్థలికి చేరుకున్నారు.
Pedakakani Goshala Tragedy Incident : మృతులు గోశాల సూపర్వైజర్ శివరామ కాలిబాబుతో పాటు కూలీలు ఏకుల రాజేష్, గందాల మహంకాలిరావు, యాదగిరి బాలయ్యగా పోలీసులు గుర్తించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా సంపు లోపలకు దిగడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విగతజీవులుగా పడి ఉన్న తమవారిని చూసి మృతుల కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది.